గ‘ఘన’ ఖ్యాతి!

Gannavaram To Singapore Flight Services Starts - Sakshi

గన్నవరం విమానాశ్రయ చరిత్రలో మరో మైలురాయి

నేటి నుంచి సింగపూర్‌కు విమాన సర్వీస్‌లు

యుద్ధ అవసరాల నిమిత్తం ప్రారంభమై అంతర్జాతీయ స్థాయినందుకున్న వైనం

చిన్న రేకుల షెడ్డు నుంచి ఇంటర్‌నేషనల్‌ టెర్నినల్‌ వరకూ ప్రగతి

రెండో ప్రపంచ యుద్ధ అవసరాల నిమిత్తం నిర్మించిన గన్నవరం విమానాశ్రయం.. అంచెలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ ఖ్యాతిని అందుకుంది. ఒకప్పుడు చిన్నస్థాయి బస్టాండ్‌ను తలపించే రేకుల షెడ్డుతో ప్రారంభమైన పౌర విమాన సేవల ప్రస్థానం.. ఇంతింతై వటుడింతై అన్నట్లు నేడు విదేశీ ప్రయాణికులకు ఆతిథ్యం ఇచ్చే స్థాయికి చేరుకుంది. ఇక దేశీయ సర్వీస్‌లలోనూ ఘనమైన ప్రగతి సాధించింది. పదిహేడేళ్ల క్రితం ఒక్క విమానంతో పునఃప్రారంభమైన దేశీయ సర్వీస్‌లు.. ప్రస్తుతం రోజుకు 56కు చేరుకున్నాయి.  

కృష్ణాజిల్లా, విమానాశ్రయం(గన్నవరం): అమరావతి రాజధాని రాకతో గన్నవరం విమానాశ్రయ దశ తిరిగిందనే చెప్పాలి. కేవలం ఐదారు ప్రాంతీయ విమాన సర్వీస్‌లకు పరిమితమైన ఈ ఎయిర్‌పోర్టుకు క్రమంగా ప్రయాణికుల తాకిడి పెరిగింది. దీంతో ఎయిరిండియా, స్పైస్‌జెట్, ట్రూజెట్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో విమాన సర్వీస్‌లు విస్తరించాయి. ప్రస్తుతం న్యూఢిల్లీ, ముంబాయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కడప, తిరుపతి, వైజాగ్‌ నుంచి ఇక్కడికి రోజుకు 56 సర్వీస్‌ల్లో సుమారుగా మూడు వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రయాణికుల ఆదరణకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కూడా సుమారు రూ. 162 కోట్లు ట్రాన్సిట్‌ టెర్మినల్‌ను గతేడాది అందుబాటులోకి తీసుకువచ్చింది.

రూ. 5 కోట్లతో ఆధునికీకరణ..
విభజన హామీల్లో భాగంగా రాజధాని ప్రాంతంలోని ఈ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ విమానాశ్రయ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2017 మార్చిలో గజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. దీంతో అంతర్జాతీయ ప్రయాణికుల సేవల కోసం నిరుపయోగంగా ఉన్న పాత టెర్మినల్‌ను సుమారు రూ. 5 కోట్లతో ఆధునీకరించారు. కస్టమ్స్, ఇమిగ్రేషన్‌ అనుమతులు వచ్చినప్పటికీ విదేశీ సర్వీస్‌లు నడిపేందుకు తొలుత విమాన సంస్థలు ముందుకురాలేదు. చివరికి రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు ఇండిగో విమాన సంస్థ సింగపూర్‌కు విమానసర్వీస్‌లు నడిపేందుకు ముందుకువచ్చింది.

నేటి నుంచి సర్వీస్‌లు
ఈ నెల 4 నుంచి వారంలో ప్రతి మంగళ, గురువారాల్లో సింగపూర్‌ నుంచి ఇక్కడికి సర్వీస్‌లను ఇండిగో నడపనుంది. ఇప్పటి వరకు సింగపూర్‌కు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి రాకపోకలు సాగిస్తున్న ఈ ప్రాంత విమాన ప్రయాణికులు ఇప్పుడు నేరుగా వెళ్లే సదుపాయం లభించింది. సింగపూర్‌–గన్నవరం మధ్య విమాన ప్రయాణ సమయం కూడా నాలుగు గంటలు మాత్రమే.

టికెట్‌ ధరలు ఇలా..
టికెట్‌ ప్రారంభ ధరను ఇక్కడి నుంచి సింగపూర్‌కు రూ. 7,508, సింగపూర్‌ నుంచి ఇక్కడికి రూ. 10,422గా ఆ సంస్థ నిర్ణయించింది. 180 మంది ప్రయాణ సామర్థ్యం కలిగిన ఎయిర్‌బస్‌ ఎ320 విమానం సింగపూర్‌ నుంచి ఉదయం 11.40 గంటలకు బయలుదేరి సాయంత్రం 3.45కు ఇక్కడికి చేరుకుంది. తిరిగి అదే రోజు సాయంత్రం 6.40కు ఇక్కడి నుంచి బయలుదేరి రాత్రి 10.40కు సింగపూర్‌కు చేరుకుంటుందని ఇండిగో ప్రతినిధులు పేర్కొన్నారు.

ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా..
ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లో సింగపూర్‌ వెళ్లే తొలి ప్రయాణికులకు ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా బోర్డింగ్‌ పాస్‌లను అందజేయనున్నారు. అనంతరం సింగపూర్‌ వెళ్లనున్న సర్వీస్‌కు ఉపరాష్ట్రపతితో పాటు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి సురేష్‌ప్రభు జెండా ఊపి ప్రారంభించనున్నారు.

ఆదరణ పెరిగే అవకాశం..
మంగళవారం ప్రారంభంకానున్న తొలి సర్వీస్‌కు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సింగపూర్‌ నుంచి ఇక్కడికి వచ్చే విమానానికి సుమారు 137, ఇక్కడి నుంచి సింగపూర్‌కు వెళ్లే సర్వీస్‌కు 85 టికెట్లు బుక్‌ అయినట్లు చెప్పారు. సింగపూర్‌ నుంచి కౌలాలంపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, పిలిప్పీన్స్, న్యూజీలాండ్‌ వెళ్లేందుకు సులువైన కనెక్టివిటి కూడా ఉండడంతో ఈ సర్వీస్‌కు ప్రయాణికుల ఆదరణ పెరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top