ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ నిరంకుశ వైఖరికి నిరసనగా వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈనెల 19 నుంచి చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఈనెల 20వ తేదీ నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ పిలుపునిచ్చారు.
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్:ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ నిరంకుశ వైఖరికి నిరసనగా వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈనెల 19 నుంచి చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఈనెల 20వ తేదీ నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ పిలుపునిచ్చారు.
అందరికీ సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌కు సానుకూల స్పందన లభించనందుకు నిరసనగా విజయమ్మ ఆమరణ దీక్షకు పూనుకుంటున్నారని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు, మండల శాఖల కన్వీనర్లు రిలే నిరాహార దీక్షల విషయంలో ఉమ్మడిగా చర్చించుకుని కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కోరారు. విజయమ్మ ఆమరణ దీక్ష కొనసాగినంత కాలం మండల కేంద్రాల్లో కూడా రిలే దీక్షలు కొనసాగించాలని ఆయన కోరారు. నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ మండల కన్వీనర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, విభజన విషయంలో కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలను ప్రజలకు వివరించి చైతన్యవంతుల్ని చేయాలని కోరారు.