చిన్నపిల్లలకు ఉచిత శస్త్ర చికిత్సలు వైఎస్సార్‌ చలువే

Free surgical treatments to the kids only because of YSR - Sakshi

తెలంగాణ డీఎంఈ డాక్టర్‌ రమేష్‌రెడ్డి

కర్నూలు (హాస్పిటల్‌): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్లే 80 శాతం చిన్నపిల్లల శస్త్రచికిత్సలు ఉచితంగా చేయగలుగుతున్నామని, తద్వారా వేలాది మంది చిన్నారుల ప్రాణాలు కాపాడుతున్నామని తెలంగాణ రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) డాక్టర్‌ కె.రమేష్‌రెడ్డి అన్నారు. శనివారం కర్నూలు మెడికల్‌ కాలేజీలోని న్యూ లెక్చరర్‌ గ్యాలరీలో ఏపీ పీడియాట్రిక్‌ సర్జన్స్‌ సంఘం రాష్ట్ర సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్‌ కె.రమేష్‌రెడ్డి మాట్లాడుతూ..వేలాది రూపాయలు ఖర్చు చేసి చికిత్స చేయించుకోలేని పేదలకు ఆరోగ్యశ్రీ వల్ల ఎంతో మేలు జరుగుతోందన్నారు. ఈ పథకం వల్ల పీడియాట్రిక్‌ సర్జరీ విభాగాలు కూడా అభివృద్ధి చెందాయన్నారు. ఇలాంటి విభాగాలకు పీజీ వైద్యులు వెన్నెముకగా ఉంటారన్నారు. సదస్సులో ఏపీ పీడియాట్రిక్‌ సర్జన్స్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్‌ చంద్రభాస్కర్‌రావు, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్‌ సి.సునీల్‌కుమార్‌రెడ్డి, కోశాధికారిగా డాక్టర్‌ రవికుమార్‌ను ఎన్నుకున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top