డీసీసీబీలో డిపాజిట్‌ లీలలు

Fraud Fixed Deposits In DCCB Bank - Sakshi

అధిక వడ్డీ కోసం భారీగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు  

ఓ ఉద్యోగి చేసిన గోల్‌మాల్‌ వ్యవహారం

తెలిసినా పట్టించుకోని ఉన్నతాధికారులు  

ఉద్యోగం చేస్తూనే రెగ్యులర్‌ లా కోర్సు చదివిన వైనం  

సదరు ఉద్యోగికి పదోన్నతి కోసం టీడీపీ నేతల యత్నాలు  

సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో రోజుకో లీల బయటకు వస్తోంది. ఏకంగా ఉద్యోగం చేస్తూనే మూడేళ్ల పాటు రెగ్యులర్‌గా లా కోర్సు చదవడంతోపాటు అధిక వడ్డీ కోసం ఉద్యోగుల పేరుతో భారీగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసిన వ్యవహారం ఆ శాఖలో చర్చనీయాంశమవుతోంది. కర్నూలు, ఎమ్మిగనూరు తదితర బ్యాంకు బ్రాంచ్‌ల్లో ఒక ఉద్యోగి రూ.60 లక్షల మేర ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు(ఎఫ్‌డీలు) చేసినట్లు సమాచారం. తన తల్లితో పాటు ఉద్యోగి పేరు మీద కలిసి ఈ డిపాజిట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు అయినప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధిక శాతం వడ్డీ వస్తుందనే ఆశతోనే ఈ విధంగా భారీ మొత్తంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. అయితే గతంలో ఇదే ఉద్యోగి ఉద్యోగం చేస్తూనే రెగ్యులర్‌గా లా కోర్సు చేశారన్న వ్యవహారం బయటకు వచ్చినప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా తొక్కిపెట్టారు. ఇదే తరహాలో తాజాగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌ వ్యవహారంపై కూడా తూతూమంత్రంగా విచారణ జరిపి కాపాడే ప్రయత్నం జరుగుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా సదరు ఉద్యోగికి పదోన్నతి ఇవ్వాలని కూడా అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు వస్తుండటం కొసమెరుపుగా మారింది. 

అధిక వడ్డీ ఆశతో...
కేడీసీసీ బ్యాంకులో సొంత ఉద్యోగులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే అధిక వడ్డీ ఇవ్వడం ఆనవాయితీ. బయటి వ్యక్తులు చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు ఇచ్చే వడ్డీ కంటే ఒక శాతం అదనంగా సొంత శాఖ ఉద్యోగులకు ఇస్తోంది. దీనిని ఆసరాగా చేసుకుని సుమారు రూ.60 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను వేర్వేరు బ్రాంచులలో తన తల్లి, స్థానికంగా బ్యాంకులో పనిచేసే బ్యాంకు ఉద్యోగి పేరు మీద ఎఫ్‌డీలు చేయించారు. ఇందుకోసం స్థానికంగా బ్యాంకులలో పనిచేసే సిబ్బంది కూడా విమర్శలు ఎదుర్కొంటున్న ఉద్యోగికి సహకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు మొత్తం నోట్ల రద్దు సమయంలో పాత నోట్ల రూపంలో వచ్చి పడ్డాయా అనేది కూడా తేలాల్సి ఉంది. అంటే అక్రమ సంపాదనను ఈ విధంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో అది కూడా అధిక వడ్డీ వచ్చే విధంగా మొత్తం వ్యవహారం నడపడం కేడీసీసీబీలో కలకలం రేపుతోంది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా అందినట్లు తెలుస్తోంది. అయితే ఇదే ఉద్యోగిపై గతంలో లా కోర్సు చదివిన వ్యవహారంపై అడ్డంగా బుక్‌ అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తాజా ఎపిసోడ్‌లోనూ చర్యలు ఉండవనే ధీమా వ్యక్తమవుతోంది. 

పదోన్నతి కోసం...  
వాస్తవానికి కేడీసీసీలో పనిచేసే సదరు ఉద్యోగి 2001 నుంచి 2003 వరకు కర్నూలులోని శ్రీప్రసన్న కాలేజ్‌ ఆఫ్‌ లాలో ఎల్‌ఎల్‌బీ కోర్సును రెగ్యులర్‌గా చదివారు. ఉద్యోగానికి సెలవు పెట్టకుండానే ఈ కోర్సు చదివారు. దీనిపై పక్కా ఆధారాలు ఉన్నప్పటికీ ఎటువంటి చర్య తీసుకోలేదు. తాజాగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వ్యవహారం కూడా దుమారం రేపుతోంది. అయినప్పటికీ సదరు ఉద్యోగికి పదోన్నతి ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతుండటం గమనార్హం. పదోన్నతి ఇవ్వాలంటూ అధికార పార్టీకి చెందిన పలువురు రాజకీయ నేతలు కేడీసీసీబీ ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జరుగుతున్న  డీసీసీబీ పాలకవర్గ సమావేశం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top