జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో శనివారం సంభవించిన విద్యుదాఘాతాల్లో నలుగురు మృత్యు వాత పడ్డారు. కాకినాడ రూరల్ మండలంలో
కాకినాడ క్రైం : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో శనివారం సంభవించిన విద్యుదాఘాతాల్లో నలుగురు మృత్యు వాత పడ్డారు. కాకినాడ రూరల్ మండలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగలడంతో షాక్‌కు గురై ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గొల్లపేటకు చెందిన మొగలినీడి నవీన్ కుమార్ (14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
సెలవులు కావడంతో పేపర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం ఆర్‌ఆర్ నగర్‌లోని కాపు కల్యాణ మంటపం సమీపంలో పేపర్ వేసేందుకు వెళ్తుండగా విద్యుత్ తీగ తెగి పడింది. విద్యుదాఘాతానికి గురైన నవీన్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సర్పవరం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ నాయకుడు పిల్లి సత్యనారాయణ మూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. నవీన్‌కుమార్ కుటుంబసభ్యులు సంఘటనా స్థలంలో రోదించిన తీరు కలచివేసింది. బాలుడి మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. కేసును సర్పవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గొల్లప్రోలులో..
గొల్లప్రోలు : కేబుల్ వైరు నుంచి విద్యుత్ ప్రసరించడంతో షాక్‌కు గురై గొల్లప్రోలు ఈబీసీ కాలనీకి చెందిన ఇంధన శ్రీనివాస్ (27) శనివారం మృతి చెందాడు. శుక్ర వారం రాత్రి కురిసిన భారీ వర్షం, పిడుగు పాటు వల్ల టీవీ దెబ్బ తింటుందనే ఉద్దేశ్యం తో టీవీకి ఉన్న కేబుల్ వైరు తొలగించాడు. శనివారం ఉదయం టీవీకి కేబుల్ వైర్ అమర్చుతుండగా షాక్‌కు గురై మృతి చెందాడు. మృతుడికి భార్య దేవి, ఏడాదిన్నర వయస్సుగల కుమార్తె నవ్యభారతి ఉన్నారు. శ్రీనివాస్ మృతితో ఈబీసీ కాలనీలో విషాదం అలుముకుంది. మృతుడు పచ్చళ్ల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.
యానాంలో
వైర్ మెన్ మృతి
యానాం టౌన్ : ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురై ఒక వైర్‌మెన్ మృతి చెందిన సంఘటన శనివారం యానాం లో చోటుచేసుకుంది. స్థానిక విద్యుత్ శాఖలో వైర్‌మెన్‌గా పనిచేస్తున్న స్థానిక ఫరంపేట గ్రామానికి చెందిన కర్రి భైరవమూర్తి (43) ఉదయం యానాం శివారు దొమ్మేటిపేటలో ఒక ఇంటికి సంబంధించి సర్వీస్ వైర్ కలుపుతుండగా ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెంది నట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఎస్సై బడుగు కనకారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
షాక్‌కు గురై ఎలక్ట్రీషియన్ మృతి
గోకవరం : మండలంలోని గుమ్మళ్లదొడ్డి గ్రామంలో విద్యుతాఘాతానికి గురై ఓ ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సూరిశెట్టి రామారావు (70) శనివారం ఉదయం తన ఇంట్లో స్విచ్ బోర్డును రిపేరు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన పంచాయతీ ఎలక్ట్రీషియన్‌గా సేవలందిస్తున్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు శనివారం గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. దీనిపై తమకు ఎటువంటి సమాచారం అందలేదని గోకవరం పోలీసులు తెలిపారు.