
అభివృద్ధిపై చెరగని ముద్ర
ఆయన రాజకీయాల్లోకి తండ్రి వారసునిగానే వచ్చినా.. అనతికాలంలోనే తన సామర్థ్యాన్ని చాటుకున్నారు. అభివృద్ధిపై తనదైన చెరగని ముద్ర వేశారు.
కాకినాడ :ఆయన రాజకీయాల్లోకి తండ్రి వారసునిగానే వచ్చినా.. అనతికాలంలోనే తన సామర్థ్యాన్ని చాటుకున్నారు. అభివృద్ధిపై తనదైన చెరగని ముద్ర వేశారు. ఆయనే కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి శ్రీరామ సంజీవరావు. వయోభారం మీదపడ్డా, శారీరకంగా అశక్తులైనా.. ఆయనలోని ప్రగతిప్రియత్వం అణువంత క్షీణించలేదు. తుదిశ్వాస విడవడాని కి కొంచెం ముందు కూడా..ప్రగతిపథంలో పరుగు లు తీస్తున్న కాకినాడతీరాన్ని చూసి మురిసిపోయారు.
బుధవారం మధ్యాహ్నం కాకినాడలో కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి సంజీవరావు జిల్లా నుంచి కేంద్రస్థాయికి ఎదిగిన కొద్దిమంది నేతల్లో విలక్షణమైన వారు. ఆయన తండ్రి పళ్లంరాజు పీసీసీ అధ్యక్షునిగా, రాష్ర్ట మంత్రిగా పనిచేశారు. బాగా చదువుకుని ఉన్నతోద్యోగంలో స్థిరపడ్డ సంజీవరావు తండ్రి వారసునిగా రాజకీయ అరంగేట్రం చేసి, 1970లో జరిగిన ఉపఎన్నికలో రామచంద్రపురం ఎమ్మెల్యేగా ఏకగ్రీ వంగా ఎన్నికయ్యారు. తరువాత 1971లో వచ్చిన లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో 2,92,300 ఆధిక్యతతో గెలిచి, దేశంలోనే రెండో అత్యధిక మెజార్టీ సాధించిన విజేతగా గుర్తింపు పొందారు. తరువాత 1977లో, తిరిగి 1980లో కాకినాడ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
సంజీవరావు ప్రతిభను గుర్తించిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1982లో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఎలక్ట్రానిక్స్ డెవలప్‌మెంట్ హైలెవెల్ కమిటీ, నేషనల్ హార్బర్ కమిటీ, మైనర్‌పోర్టుల అభివృద్ధికి సంబంధించి ఉన్నతస్థాయి కమిటీల సభ్యునిగానూ సంజీవరావు సేవలందించారు. తదుపరి ఎన్నికల్లో ఆయన ఓటమి చెందినప్పటికీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ చైర్మన్‌గా నియమితులయ్యారు.
ఆసియా క్రీడలను ‘చూపించారు’..
కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో సంజీవరావు అభివృద్ధిపై తనదైన ముద్ర వేశారు. 1982 ప్రాంతంలో ఆసియాగేమ్స్ జరుగుతున్నప్పుడు ఈ ప్రాంతవాసులకు దూరదర్శన్ ప్రసారాలను అందుబాటులోకి తెచ్చారు. అప్పట్లో హైదరాబాద్ మినహా విజయవాడ, విశాఖపట్టణం వంటి ప్రాంతాల్లో కూడా రిలేకేంద్రాలు లేవు. అప్పుడు కాకినాడలో రిలే కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా ఆయన ఈ ప్రాంత ప్రజల్లో ఎంతో గుర్తింపు పొందారు. కాకినాడ హార్బర్ అభివృద్ధి, కాకినాడ బీచ్‌రోడ్ నిర్మాణం ఆయన హయాంలో జరిగినవే.
నడవలేకున్నా నిత్యం ‘ప్రగతిపథ సంచారి’
రెండు దశాబ్దాల క్రితం పక్షవాతానికి గురైన సంజీవరావు అప్పటి నుంచీ చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. సెరిబ్రల్ పెరాలటిక్ హెమరేజ్‌తో బాధపడుతున్న ఆయనకు అప్పటి నుంచీ మాట కూడా పడిపోయి, సైగలకే పరిమితం కావలసి వచ్చింది. అయితే అందరినీ గుర్తించడం, పలకరింపుగా హావభావాలు కనబరిచే వారు. 20 ఏళ్ళుగా అస్వస్థతతో ఉన్నా తన హయాంలో ప్రారంభమైన రేవు అభివృద్ధి, బీచ్ ప్రాంత ప్రగతిపై ఆయన కడదాకా ఆసక్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రోజూ ఉదయం గంటసేపు కారులో బీచ్, పోర్టు ఏరియాలకు వెళ్ళి వచ్చేవారు.
చివరికి బుధవారం మధ్యాహ్నం రెండు గంటలప్రాంతంలో గుండెనొప్పితో తుదిశ్వాస విడవడానికి కొన్ని గంటల ముందు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించి వచ్చారు. సంజీవరావుభౌతికకాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. కాగా సంజీవరావు మరణించిన సమయంలో ఆయన కుమారులు ఎంఎం పళ్లంరాజు (కేంద్ర మాజీ మంత్రి), ఆనంద్ స్థానికంగా లేరు. ఆయన మరణవార్త తెలియగానే హైదరాబాద్ నుంచి బయలుదేరి రాత్రికి కాకినాడ చేరుకున్నారు. వారిని వివిధ పార్టీల నేతలు, పలువురు ప్రముఖులు పరామర్శించారు. గురువారం కాకినాడలో సంజీవరావు అంత్యక్రియలు జరగనున్నాయి.