వర్షం.. బీభత్సం | Flood Water In Krishna | Sakshi
Sakshi News home page

వర్షం.. బీభత్సం

Aug 20 2018 1:15 PM | Updated on Aug 20 2018 1:15 PM

Flood Water In Krishna - Sakshi

చెరువును తలపిస్తున్న తిరువూరు మెయిన్‌ రోడ్డు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో శనివారం ఉదయం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి, పగలు తేడాలేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షంతో వాగులు వంకలు పొంగుతుండగా, చెరువులునిండుకుండలను తలపిస్తున్నాయి. పొలాలు, రహదారులపై నీళ్లు పొంగి పొర్లుతున్నాయి. వాగులు వరద ఉధృతి కారణంగా ఉగ్రరూపం దాల్చుతున్నాయి. దివిసీమలో పాముల బెడద అధికమైంది. రెండు రోజుల వ్యవధిలో 30 పాముకాటు కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థమవుతోంది. పశ్చిమకృష్ణాలో పత్తి, వరి, పెసర పంటలు నీట మునిగాయి.

సాక్షి, మచిలీపట్నం: జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. జిల్లాలో 50 మండలాల పరిధిలో వర్షం కురవగా.. 28 మండలాల్లో సాధారణ, 18 మండలాల్లో విస్తారంగా, 4 మండలాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 47.2 మిల్లీ మీటర్లు నమోదవగా.. అత్యధికంగా విస్సన్నపేటలో 112.4 మిల్లీ మీటర్లు నమోదైంది. తర్వాతి స్థానంలో వీరులపాడులో 96.2 మిల్లీ మీటర్లు, జి.కొండూరు 88.4, పెనమలూరు 84.6, ముసునూరు 78.5, కంచికచెర్ల 76.6, ఇబ్రహీంపట్నం 76.6, నందిగామ 74.4, కృత్తివెన్ను 68.4, మండవల్లి 65.4, బంటుమిల్లి 64.2, వత్సవాయి 62.2, విజయవాడ అర్బన్, రూరల్‌ 60.8, గుడ్లవల్లేరు 60.4, కంకిపాడు 60.2, తోట్లవల్లూరు 59.2, చాట్రాయి 59, ఉయ్యూరు 53.6, గుడివాడ 53.4, పెదపారుపూడి 53.2, తిరువూరు 50.6 మిల్లీ మీటర్లు నమోదైంది.

పశ్చిమకృష్ణాలో ఉధృతంగా..
పశ్చిమకృష్ణాలో వరద ఉధృతి పెరిగింది. ప్రధాన వాగులైన కట్లేరు, తమ్మిలేరు, రామిలేరు, మునేరు వాగులు వరద నీటితో పొటెత్తాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది నీటి మట్టాన్ని ప్రభావితం చేసే మునేరు పరవళ్లు తొక్కుతోంది.
పడమటివాగు, ఎదుళ్లవాగు, పిల్లవాగు వంటి మరో 12 సైతం నీటితో నిండాయి.
తిరువూరు పట్టణంలోని ప్రధాన రహదారుల్లో వర్షపునీరు మోకాలిలోతు నిలిచిపోయింది. మెట్ట, మాగాణి భూములు నీటిలో చిక్కుకున్నాయి. చెరువుల కట్టలు తెగిపోయే పరిస్థితి తలెత్తింది. కట్టెలేరు, పడమటివాగు, వెదుళ్లవాగు, గుర్రపువాగుల్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. 10 వేల ఎకరాల్లో పత్తి, వరి నార్లు మళ్లు నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
మెట్ట భూముల్లో నీరు నిలిచి ఉంటే పెసర, మినుము, కంది, పత్తి వంటి పంటల్లో వేరుకుళ్లు తెగుళ్లతో పాటు వాతావరణంలో తేమశాతం అధికంగా ఉండటంతో చీడపీడలు ఆశించే అవకాశం ఉంది.     
వాగులు పొంగి తిరువూరు–విస్సన్నపేటకు రాకపోకలు స్తంభించాయి. గంపలగూడెం మండలం ఇనగడప వద్ద వాగు పొంగి రాకపోకలు నిలిపేశారు.
పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో ఉప్పొంగిన వాగులు, వంకలతో పొలాల్లోకి చేరిన వరద నీరు చేరింది.
బందరు రూరల్‌ మండలం గోపువానిపాలెం వద్ద బీచ్‌కు వెళ్లే రోడ్డులో వృక్షం నేలవాలింది. స్పం దించిన పోలీసులు చెట్టును వెంటనే తొలగించారు.
బందరు పట్టణం జలమయమైంది. బస్టాండ్‌ ఆవరణంలో నీరు చేరి చెరువును తలపించింది.
ఇబ్రహీంపట్నం మండలం కొట్టికల్లపూడి వద్ద వాగు పొంగింది. ఫలితంగా కొట్టికల్లపూడి, కేతనకొండ గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి.

తీరంలో అలజడి..
తీర ప్రాంతంలో సముద్ర ఉపరితలం చురుగ్గా ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర గాలులు గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీస్తున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది.  

తడిసి ముద్దయిన విజయవాడ
శనివారం రాత్రంతా కురిసిన భారీ వర్షానికి విజయవాడ నగరం తడిసి ముద్దయింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్డపైకి వర్షపు నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఆటోనగర్, మొగల్రాజపురం, ఇందిరాగాంధీ స్టేడియం, వన్‌టౌన్, పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపించింది. ఈదురు గాలుల కారణంగా కొన్ని చోట్ల విద్యుత్‌ తీగలు తెగిపోయి విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.

వరికి కొంత నష్టం
పశ్చిమకృష్ణాలో వరి పంటకు నష్టం వాటిల్లింది. తూర్పుకృష్ణాలో ఇప్పటి వరకు నష్టం ప్రభావం అంతగాలేకపోయినా.. వర్షాలు ఇలాగే కొనసాగితే పరిస్థితి నష్టాలకు దారితీస్తుందన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండటంతో జిల్లాలో వరి, జొన్న, మొక్కజొన్న, పెసర, కంది, మినుము, వేరుసెనగ, పత్తి, మిర్చి వంటి పంటలు 3.2 లక్షల హెక్టార్లలో సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది.వర్షాలకు జిల్లాలోని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. జిల్లాలో మొత్తం 930 చెరువులుండగా.. 80 శాతానికి పైగా చెరువుల్లో నీరు చేరినట్లు సమాచారం.

రెండు రోజుల్లో 30 పాము కాటు కేసులు
దివిసీమ వాసులకు పాముల బెడద ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నీటి ముంపుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పాముల వీరవిహారంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వరద నీటిలో భారీగా కొట్టుకువచ్చిన పాములు పలువురిని కాటేశాయి. ఆదివారం ఒక్క రోజే అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి 8 మంది పాములు కాటేసేయని రావడంతో వారందరికీ హాస్పిటల్‌ సిబ్బంది వైద్యం అందించారు. శనివారం 22 పాముకాటు కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు రోజుల్లో 30 కేసులు నమోదవగా.. ఒకరు మృతి చెందారు. కోడూరు, నాగాయలంక ఆస్పత్రుల్లో యాంటీ స్నేక్‌ వీనం లేక ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి నుంచి అవనిగడ్డ ఆస్పత్రికి తీసుకురావాలంటే కనీసం రెండు గంటల వ్యవధి పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement