పెళ్లింట విషాదం | Five people killed by Larry roll | Sakshi
Sakshi News home page

పెళ్లింట విషాదం

Dec 20 2014 2:10 AM | Updated on Apr 4 2019 5:24 PM

పెళ్లింట విషాదం - Sakshi

పెళ్లింట విషాదం

పెళ్లింట విషాదం నెలకొంది. అంతవరకూ సందడిగా సాగిన వారి పయనంలో అపశృతి చోటుచేసుకుంది.

గిద్దలూరు: పెళ్లింట విషాదం నెలకొంది. అంతవరకూ సందడిగా సాగిన వారి పయనంలో అపశృతి చోటుచేసుకుంది. నల్లమల అడవుల మలుపులో లారీ బోల్తా పడి ఐదుగురు మృతి చెందగా, 50 మందికి పైగా తీవ్ర గాయాలపాలైన సంఘటన ప్రకాశం, కర్నూలు జిల్లాల సరిహద్దుల్లో శుక్రవారం రాత్రి జరిగింది. అందిన వివరాల ప్రకారం  గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని చట్రెడ్డిపల్లె గ్రామానికి చెందిన బిజ్జా నరసయ్యకు కర్నూలు జిల్లా గోపవరానికి చెందిన యువతితో వివాహమైంది. అనంతరం తిరుగు పెళ్లిలో భాగంగా చట్రెడ్డిపల్లెకు చెందిన బంధువులతో పెళ్లి కుమారుడు, పెళ్లికుమార్తెతో కలిసి గోపవరానికి లారీలో వెళ్తున్నారు.

ఇందులో వరుని బంధువులంతా కలిసి దాదాపు 70 మందికి పైగా ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలోని పాత రైల్వే బ్రిడ్జి దాటిన తర్వాత లారీ కొండను ఢీకొనడంతో బోల్తాపడింది. దీంతో లారీలో ఉన్న 70 మంది పెళ్లి బృందం ఒక్క సారిగా కింద పడిపోయారు. లారీ కింద పడిన పలువురు అక్కడికక్కడే మృతి చెందగా, 50 మందికి పైగా తీవ్ర గాయాలతో బయటపడ్డారు. వీరిలోనూ 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. వివాహ వేడుకల నడుమ ఆనందాల్ని పంచుకోవాల్సిన తరుణంలో ఇంత విషాదం చోటు చేసుకోవడంతో గ్రామంలో రోదనలు మిన్నంటాయి.

లారీలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్తపు గాయాలతో ఉండటం చూస్తే ఎంతటి ఘోరప్రమాదమో తెలుస్తోంది. ఈ సంఘటనలో వరుడు నరసయ్యకు, వధువుకు ఎలాంటి గాయాలు కాలేదని బంధువులు చెబుతున్నారు. మిగిలిన ప్రతి ఒక్కరికీ గాయాలయ్యాయి. ఇందులో గడ్డం వెంకటయ్య (40) గిద్దలూరు వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. లారీ కింద పడి తిరుపాలు, ప్రభాకర్, ఏసోబు, కర్నూలు జిల్లా బోయలకుంటకు చెందిన ఉడుముల జయమ్మ చనిపోయారు. గాయపడిన వారిలో మంజు, బిజ్జ సురేష్ మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. అందరికీ ఏరియా వైద్యశాల వైద్యులు, ఆర్‌ఆర్ నర్సింగ్ హోం వైద్యులు చికిత్సలందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement