
గంగమ్మే కాపాడింది..
వేటకు బయలుదేరి గల్లంతైన జాలరులు ఎట్టకేలకు సురక్షితంగా ఒడ్డుకు చేరారు...
సురక్షితంగా విశాఖ చేరుకున్న మత్స్యకారులు
మల్కాపురం(విశాఖపట్నం): వేటకు బయలుదేరి గల్లంతైన జాలరులు ఎట్టకేలకు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఆరుగురు వేటకు ఈనెల 17నుంచి నడిసముద్రంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. గంగమ్మ తల్లే కాపాడిందంటూ వారు కంటతడి పెట్టారు. వివరాలిలా..కాకినాడ దుమ్మిలపేట,దుర్గమ్మవీది ప్రాంతానికి చెందిన అర్జిల అప్పారావు,కె.చిన్నారావు,దోని నర్సింహమూర్తి, దాసరి దానయ్య, పేల్ల మహేష్,అర్జిల శ్రీనులు ఈ నెల 16 తేదిన చేపల వేటకొసం కాకినాడ తీరం నుంచి బయలు దేరారు. మర్నాడు తుఫాన్ కారణంగా వర్షానికి సముద్రంలో చిక్కుకున్నారు. ఒడ్డుకు రాలేని పరిస్థితి ఏర్పడింది. వల,లంగర్‌ను ఉపయోగించి ఒడ్డుకు చేరేందుకు విఫలయత్నం చేశారు.
ఈదుకుంటూ ఒడ్డుకు చేరాలనే ఆలోచనవచ్చినా సాధ్యంకాదని విరమించుకున్నారు. దీంతో తమ జీవితాలు అంతమయ్యాయని భావించారు. భయం..ఆందోళనల మధ్య ఐదు రోజుల పాటు తిండి,నిద్ర కరవైంది. ఈనేపథ్యంలో ఈనెల 22న వారికి ఆశారేఖగా దూరం నుంచి ఓ నౌక కనిపించింది. వెంటనే వీరికి కొత్త ఊపిరి వచ్చింది. హెచ్‌పీసీఎల్ అయిల్‌వార్ఫ్ వద్ద నాప్తా లోడు కోసం హల్దీయా ( నుంచి సపూర్ణస్వరాజ్ అనే నౌక విశాఖ వస్తున్న నౌక ఇది. రక్షించాలంటూ జాలర్లు తెలపువర్ణంతో కూడి వస్త్రాన్ని చూపడంతో నౌకా సిబ్బంది గమనించి కెప్టెన్ ఎం.వి.రాధికమీనన్ కు తెలిపారు.
వెంటనే అమె నౌకపై నుంచి చూసి కొందరు ఆపదలో వున్నారని గుర్తించారు. సిబ్బంది వారిని చాకచక్యంగా బోటునుంచి నౌక పైకి తీసుకువచ్చారు. వెంటనే తినడానికి తిండి పెట్టియోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తరువాత హెచ్‌పీసీఎల్ యాజమాన్యానికి నౌక కెప్టెన్ ఫోన్‌లో సమాచారం అందించారు. వారు పోర్టు,మత్యశాఖ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. జిల్లా మత్యశాఖ అధికారులు వీరిని తరలించేందుకు పలు కారణాలు చూపారు. చివరకు హెచ్‌పీసీఎల్ ఈడీ శ్రీగణేష్ బాధితులను విశాఖకు తీసుకురాావాలని ఆదేశించారు.
దీంతో బాధిత మత్స్యకారులను నౌకలో సోమవారం రాత్రి ఏడు గంటలకు విశాఖలో హెచ్‌పీసీఎల్ పైపుల్‌న్ వద్ద గల అయిల్‌వార్ఫ్ వద్దకు తీసుకువచ్చారు. అక్కడ కిందకు దిగిన మత్స్యకారులకు జిల్లా మత్యశాఖ జెడీ కోటేశ్వరావు,ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్,ఏపి మెకనైజిడ్ ఫిషింగ్ బోట్ అప్‌రేటర్స్ అసోసియోషన్ అధ్యక్షులు పి.సి.అప్పారావు,హెచ్‌పీసీఎల్ చీఫ్‌మెనేజర్ సి.హెచ్.రత్నకర్,మేనేజర్ హిందీ డాక్టర్ మహదేవ్,చీఫ్ మేనేజర్ నాగేశ్వరావు,టి.రామ్‌ప్రసాద్ తదితరులు స్వాగతం పలికారు. అప్పటికే అక్కడున్న కుటుంబ సభ్యులను చూసిన మత్స్యకారుల ఆనందానికి అవధుల్లేవు.