పాపికొండలు విహారయాత్రలో ప్రమాదం

Fire Accident In Boat At Papikondalu - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: పాపికొండలు విహారయాత్రలో ప్రమాదం చోటు చేసుకుంది. పాపికొండలు యాత్రకు పర్యాటకులతో బయల్దేరిన ఓ బోటులో శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం వీరవరపులంక వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగింది. బోటులో ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. విహారయాత్రకు వినియోగించిన బోటు పాతది కావడం వల్ల ఇంజన్ హీట్ ఎక్కి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో 

బోటులో 80 మంది పర్యాటకులు ఉన్నారు. ఘటన గురించి తెలుసుకున్న వీరవరపులంక వాసులు పలువురు ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. సమాచారమందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్నారు. స్థానికుల సాయంతో మిగతావారిని కూడా రక్షించారు. మంటల ధాటికి పడవ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం ప్రయాణికులను అక్కడి నుంచి తరలించి వైద్య సేవలు అందించారు.

చంద్రబాబు ఆరా
పాపికొండలు యాత్రకు వెళ్లిన పడవ ప్రమాదానికి గురైన ఘటనపై సీఎం చంద్రబాబునాయుడు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.ప్రయాణికుల క్షేమ సమాచారంపై ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేయాలని ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top