ప్రకాశం జిల్లా మార్కాపురంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని పారిశ్రామిక వాడలో ఉన్న వీరయ్య ఆయిల్ ఫ్యాక్టరీలో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ పక్కనే ఉన్న మరో రెండు గొడౌన్లకు వ్యాపించాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఫైర్‌సిబ్బంది హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 15 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.