ఎట్టకేలకు బుధవారానికి నెల్లూరు కార్పొరేషన్‌కు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఏదైతేనేం ట్రాన్స్‌కో తన పంతాన్ని నెగ్గించుకొంది.
ఎట్టకేలకు.. కార్పొరేషన్‌లో వెలుగు
నెల్లూరు(అర్బన్), న్యూస్‌లైన్: ఎట్టకేలకు బుధవారానికి నెల్లూరు కార్పొరేషన్‌కు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఏదైతేనేం ట్రాన్స్‌కో తన పంతాన్ని నెగ్గించుకొంది. నెల్లూరు నగర పాలక సంస్థకు, విద్యుత్ శాఖకు మధ్య ఓ విధంగా ప్రచ్ఛన్న యుద్ధమే జరుగుతోంది. రెండు శాఖల మధ్య సమన్వయం కుదరకపోవడంతో దాని ప్రభావం కార్పొరేషన్‌పై పడింది. దీంతో కార్పొరేషన్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సుమారు మూడు వారాల క్రితం కార్పొరేషన్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పాత బకాయిలన్నీ పేరుకుపోయి వడ్డీలు పెరిగి కార్పొరేషన్ కరెంటు బిల్లు బకాయి సుమారు రూ.24 కోట్లకు చేరింది. పాతబకాయిలు చెల్లించాలంటూ ఇటీవల పలు దఫాలుగా నోటీసులు జారీ చేశారు.
ఫలితం లేకపోవడంతో తొలుత కార్పొరేషన్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. బుధవారం కొంతమొత్తం చెల్లించడంతో ఎట్టకేలకు కార్యాలయానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పలు దఫాలుగా కార్పొరేషన్ అధికారులు తిరుపతిలోని ట్రాన్స్‌కో సీఈని కలిసినట్టు సమాచారం. తొలుత రూ.50 లక్షలు బిల్లు చెల్లిస్తామని, విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కోరారని తెలిసింది. అయితే వారు ససేమిరా అన్నట్టు సమాచారం. మరోసారి కలిసినప్పుడు 12 వాయిదాలకు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.
అయితే వాయిదాకు రూ.2 కోట్లు చొప్పున చెల్లించాలని షరతు విధించారని సమాచారం. అయితే కార్పొరేషన్ ఖజానా ఖాళీ అయి పోవడంతో అధికారులకు ఏమిచేయాలో పాలుపోవడంలేదు. నెల్లూరు మున్సిపాలిటీ చరిత్రలో కరెంటు బిల్లు కట్టలేని దుస్థితి నెలకొనడం ఇదే ప్రథమం. ఓ విధంగా నగర పాలక సంస్థ పరువు వీధిన పడినట్టైంది. ఇదిలా ఉండగా జనరల్ ఫండ్ అకౌంట్‌ను హోల్డ్‌లో ఉంచారని సమాచారం. ఈ అకౌంట్ నుంచి ఎలాంటి చెల్లింపులు జరగకుండా నిలిపివేశారని తెలిసింది. మొదటి వాయిదా బిల్లు చెల్లించేందుకే ఈ అకౌంట్ నుంచి చెల్లింపులు నిలిపివేశారని తెలుస్తోంది. బుధవారం రూ.2.17 కోట్లకు చెక్కు ఇవ్వడంతో సాయంత్రం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో కార్పొరేషన్ కరెంటు కథ సుఖాంతమైంది.
సబ్‌స్టేషన్ వివాదమే కారణమా..
నవాబుపేట సబ్‌స్టేషన్‌ను పగలకొట్టిన ఉదంతాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాన్స్‌కో అధికారులు కరెంటు బిల్లు విషయంలో ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. సబ్‌స్టేషన్‌ను పగలకొట్టిన వివాదంలో నగర పాలక సంస్థలోని టౌన్‌ప్లానింగ్ విభాగం చైన్‌మన్లపై ట్రాన్స్‌కో కేసులు పెట్టింది. అదే విధంగా విద్యుత్ బిల్లుల కోసం చర్చించేందుకు వచ్చే ట్రాన్స్‌కో అధికారులకు కార్పొరేషన్ ఉన్నతాధికారులు కనీస మర్యాద కూడా ఇవ్వరనే ఆరోపణ కూడా ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ట్రాన్స్‌కో అధికారులు కొరడా ఝుళిపించారని సమాచారం. రెండు శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపంతో కార్పొరేషన్ రూ.లక్షల్లో ప్రజాధనం నష్టపోయింది.