
సీఆర్డీఏ పరిధిలో 220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్
కాంట్రాక్టు వ్యయం రూ.267.36 కోట్లు
టెండర్ వేసింది ముచ్చటగా మూడే సంస్థలు
అందులో రెండు జాయింట్ వెంచర్, మరొకటి డమ్మీ
కమీషన్ కోసం కాంట్రాక్టర్లను రింగ్ అయ్యేలా చేసిన నేతలు
బయటివాళ్లెవరూ టెండర్ వేయొద్దని ఫోన్లలో బెదిరింపులు?
ఏపీ ట్రాన్స్‌కోలో ఇష్టారాజ్యంగా దోపిడీ
సాక్షి, అమరావతి: ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఏపీ సీఆర్‌డీఏ) పరిధిలో విద్యుత్ సదుపాయాల కల్పన ప్రక్రియ పాలకులకు, అధికారులకు కల్పవృక్షంగా మారింది. ఇక్కడ విద్యుత్ సబ్ స్టేషన్లు, లైన్ల ఏర్పాటు పేరుతో టెండర్లు పిలిచి, తమకు అన్ని విధాలా అనుకూలంగా ఉన్నవారికే పనులు కట్టబెట్టడం, ప్రజాధనాన్ని దోచుకోవడం నిరాఘాటంగా జరుగుతోంది. తాజాగా ఓ సబ్ స్టేషన్ నిర్మాణానికి పిలిచిన టెండర్లలో కాంట్రాక్టర్లు రింగ్ మాస్టర్లుగా మారి తమకు కావాల్సిన ధరకే టెండర్ దక్కించుకున్న వైనం బయటపడింది.
ఇదీ టెండర్...
గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలోని 400/220 కేవీ సబ్ స్టేషన్ నుంచి లింగాయపాలెం సబ్ స్టేషన్ వరకు 8 కిలో మీటర్లు భూగర్భ విద్యుత్ లైన్లను ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్(ఏపీ ట్రాన్స్‌కో) ఏర్పాటు చేయనుంది. అదేవిధంగా నరసరావుపేటలోని 220కేవీ ఓల్టేజ్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి లైన్ ఇన్ లైన్ అవుట్(ఎల్‌ఐఎల్‌వో)ను తయారు చేసి 1,000 చదరపు మీటర్ల క్రాస్ లింక్డ్ పాలిథిన్ భూగర్భ లైన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఇందుకోసం సీఆర్‌డీఏ పరిధిలోని లింగాయపాలెంలో 220/33 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్(జీఐఎస్) నిరి్మంచాలని ప్రణాళికలు రూపొందించింది. దానికి రూ.267.36 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. దీనికి టెండర్లు కూడా పిలిచింది. గత నెల 18 వరకు ఆన్‌లైన్‌లో ఓపెన్ టెండర్లు స్వీకరించింది. గత నెల 21న ప్రైస్ బిడ్ తెరవాల్సి ఉండగా, 26న తెరిచి ఓ కార్పొరేట్ సంస్థకు టెండర్‌ను అప్పగించింది. 18 నెలల్లో పనులు పూర్తవ్వాలని చెప్పింది. ఇంతవరకూ బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఈ టెండర్ వెనుక అసలు కథ వేరే ఉంది.
ఇలా కొట్టేశారు..
బహిరంగ టెండరు పిలిచినప్పటికీ మూడు సంస్థలు మాత్రమే టెండర్లు వేశాయి. కాకినాడ సెజ్‌లో నిర్మిస్తున్న 400కేవీ సబ్ స్టేషన్ల పనులను రెండు సంస్థలు జాయింట్ వెంచర్(జేవీ)గా టెండర్ వేస్తే వాళ్లకు అప్పగించారు. కానీ, లింగాయపాలెం సబ్ స్టేషన్‌కు మాత్రం కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానాన్ని అనుసరించారు. అయితే, కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో జేవీలుగా టెండర్ దక్కించుకున్న సంస్థలే ఇక్కడ విడివిడిగా టెండర్లు దాఖలు చేశాయి. మరో కంపెనీ నామమాత్రంగా టెండర్ వేసింది. టెండర్ల పరిశీలనలో ఆ కంపెనీని పక్కనపెట్టేశారు.
ఇక మిగిలిన రెండు సంస్థల్లో ఒకదానికి టెండర్‌ను కట్టబెట్టారు. ఇటు సీఆర్డీఏలోనూ, అటు కాకినాడ ఎస్‌ఈజెడ్‌లోనే కాకుండా ఇవే కంపెనీలకు గతంలోనూ అనేక కాంట్రాక్టులను కూటమి ప్రభుత్వం అప్పనంగా అందించింది. నిజానికి బహిరంగ టెండర్ కావడంతో మరికొన్ని సంస్థలు కూడా దాఖలు చేయడానికి ప్రయత్నించాయి.
కానీ, ఓ మంత్రి అండతో రింగ్ మాస్టర్లుగా మారిన కొందరు కాంట్రాక్టర్లు... ఇతర సంస్థలను టెండర్లలో పాల్గొననివ్వలేదని తెలిసింది. వారికి నేరుగా ఫోన్లు చేసి మరీ బెదిరించడంతో భయపడి టెండర్ వేయడానికి ముందుకు రాలేదని ట్రాన్స్‌కో వర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్రమంగా జరిగిన ఈ టెండర్ ప్రక్రియను రద్దు చేసి మళ్లీ పారదర్శకంగా టెండర్లు పిలవాలని కొన్ని సంస్థలు ఉన్నతాధికారులను డిమాండ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచి్చంది.