
భూగర్భ విద్యుత్ లైన్ టెండర్లలో నిబంధనల ఉల్లంఘన
అస్మదీయులకు దోచిపెడుతున్న సీఆర్‌డీఏ
సీఎం చంద్రబాబు సన్నిహితులకు రూ.114.68 కోట్లు దోచిపెట్టేలా నిర్ణయం
సాక్షి, అమరావతి: ఖజానాకు ధర్మకర్తగా వ్యవహరించాల్సిన వారే ప్రజాధనాన్ని అస్మదీయులకు దోచిపెడుతున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో భూగర్భ విద్యుత్ (అండర్ గ్రౌండ్ కేబుల్) లైన్ పనుల టెండర్లలో ప్రభుత్వ పెద్దలు వ్యవహరించిన తీరే అందుకు నిదర్శనం. నిబంధనల్ని తుంగలో తొక్కి కాంట్రాక్టు విలువ కంటే 8.98 శాతం అధిక ధర కోట్ చేసిన సంస్థకు రూ.1,082.44 కోట్ల విలువైన పనులు కట్టబెట్టారు. 8.99 శాతం అధిక ధర కోట్ చేసిన మరో సంస్థకు రూ.390.06 కోట్ల విలువైన పనులు అప్పగించారు. ఈ రెండు టెండర్లలో సీఎం చంద్రబాబు సన్నిహితులకు రూ.114.68 కోట్లు దోచిపెడుతున్నారు.
టెండర్ల వివరాలివీ
రాజధాని ప్రాంతంలో ఎన్–10 రహదారి నుంచి ఎన్–13–ఈ–11 రహదారుల జంక్షన్ వరకూ 220 కేవీ ఎక్స్‌ట్రా హైవోల్టేజీ (ఈహెచ్‌వీ) లైన్‌ను అండర్ గ్రౌండ్(భూగర్భంలో)లో వేసేందుకు సంబంధించిన మిగిలిన పనులకు రూ.993.25 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్దేశించి సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) ఒక ప్యాకేజీ కింద టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
మరోవైపు రాజధానిలో ఏపీ ట్రాన్స్‌కో 18 కి.మీ. పొడవున చేపట్టిన 400 కేవీ డీసీ (డైరెక్ట్ కరెంట్) లైన్స్‌లో మిగిలిన పనులు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) 20 కి.మీ. పొడవున చేపట్టిన 400 కేవీ డీసీ లైన్స్‌లో మిగిలిన పనుల పూర్తికి రూ.283.57 కోట్ల అంచనా వ్యయంతో మరో ప్యాకేజీ కింద సీఆర్‌డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
220 కేవీ ఈహెచ్‌వీ అండర్ గ్రౌండ్ లైన్‌లో పనుల పూర్తికి పిలిచిన టెండర్లలో కాంట్రాక్టు విలువ కంటే 8.98 శాతం అధిక ధరకు అంటే రూ.1,082.44 కోట్లకు కోట్ చేసిన బీఎస్సార్ ఇన్‌ఫ్రాటెక్ ఎల్–1గా నిలిచింది. ఏపీ ట్రాన్స్‌కో, పీజీసీఐఎల్ 400 కేవీ డీసీ లైన్స్‌లో మిగిలిన పనుల పూర్తికి పిలిచిన టెండర్‌లోనూ కాంట్రాక్టు విలువ కంటే 8.99 శాతం అధిక ధరకు కోట్ చేసిన పీవీఆర్ కన్‌స్ట్రక్షన్స్–కె.రామచంద్రరావు ట్రాన్స్‌మిషన్ అండ్ ప్రాజెక్ట్స్(జేవీ) ఎల్–1గా నిలిచింది.
జీవో 133 ప్రకారం ఈ రెండు టెండర్లు రద్దు చేయాలి. కానీ.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈనెల 11న జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ 45వ సమావేశంలో ఆ రెండు టెండర్లకు ఆమోదముద్ర వేశారు. దాంతో ఆ రెండు సంస్థలకు ఆ పనులను కట్టబెట్టేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
టెండర్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి 2004 నవంబర్ 20న అప్పటి ప్రభుత్వం జీవో 133 జారీ చేసింది. ఆ జీవో ప్రకారం.. కాంట్రాక్టు విలువ కంటే 5 శాతానికి మించి అధిక మొత్తాన్ని కాంట్రాక్టర్లు కోట్ చేస్తే ఆ టెండర్‌ను రద్దు చేయాలి. మళ్లీ టెండర్ పిలవాలి. రెండుసార్లు టెండర్ పిలిచినా అదే పరిస్థితి పునరావృతమైతే ప్రభుత్వానికి నివేదించాలి. ప్రభుత్వం ఏర్పాటుచేసే కమిటీ ఆ టెండర్‌పై తగిన నిర్ణయం తీసుకుంటుంది.
ఖజానాపైరూ. 114.68 కోట్ల భారం
బీఎస్సార్ ఇన్‌ఫ్రా టెక్ సంస్థ బలుసు శ్రీనివాసరావుకు చెందినది. బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే బలుసు శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. అందువల్లే నిబంధనలను తుంగలో తొక్కి 8.98 శాతం అధిక ధరకు కోట్ చేసిన ఆ సంస్థకు పనులు కట్టబెట్టారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల ఖజానాపై అదనంగా రూ.89.19 కోట్ల భారం పడుతుంది.
ఇక పీవీఆర్ కన్‌స్ట్రక్షన్స్–కె.రామచంద్రరావు ట్రాన్స్‌మిషన్ అండ్ ప్రాజెక్ట్స్(జేవీ)కి సంబంధించి కొల్లిపర రామచంద్రరావు కూడా సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు. అందుకే ఆ సంస్థ 8.99 శాతం అధిక ధరకు కోట్ చేసినా టెండర్ ఆమోదించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఖజానాపై అదనంగా రూ.25.49 కోట్ల భారం పడుతుంది.
ఈ రెండు ప్యాకేజీల పను ల్లో నిబంధనలను తుంగలో తొక్కడం వల్ల ఖజానాపై అదనంగా రూ.114.68 కోట్ల భారం పడుతుంది. ఆ మేరకు తన సన్నిహితులకు సీఎం చంద్రబాబు ప్రయోజనం చేకూర్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో భారీగా కమీషన్లు చేతులు మారుతాయనే చర్చ అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది.