
ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో మధ్య పొసగని పొత్తు
ఉద్దేశపూర్వకంగా జెన్‌కో ఎండీని పక్కనపెట్టి నిర్ణయాలు
తాజాగా బదిలీ అయిన ట్రాన్స్‌కో జేఎండీ
ఆ స్థానంలో జెన్‌కో ఎండీని కాదని డిస్కం సీఎండీకి ఇన్‌చార్జి బాధ్యతలు
విశాఖలో ఉండే అధికారికి రాష్ట్రస్థాయిలో విజిలెన్స్, సెక్యూరిటీ అధికారాలు
కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు జెన్‌కో ఎండీ సన్నాహాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో ఉన్నతాధికారుల ఆధిపత్యపోరు తారస్థాయికి చేరింది. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్‌కో), ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ) బదిలీ కావడంతో ఆ పోస్టులో ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) సీఎండీ ఐ.పృధ్వీతేజ్‌ను ఇన్‌చార్జిగా నియమించారు.
ఈ మేరకు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో మరోసారి జెన్‌కో ఎండీని ఉద్దేశపూర్వకంగానే పక్కనపెడుతున్నట్లు రుజువైంది. ఈ పరిణామం విద్యుత్ సంస్థల ఉద్యోగుల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది.
పెద్దాయనతో పొసగడం లేదు
రాష్ట్ర ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ఇంధనశాఖ పర్యవేక్షణలో ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో, ఏపీ డిస్కంలు ఏర్పాటయ్యాయి. వీటికి ఐఏఎస్ అధికారులు, విద్యుత్ శాఖలో ఉన్నతాధికారులుగా పనిచేసి ఉద్యోగవిరమణ చేసినవారు ఎండీ, సీఎండీలుగా నియమితులవుతుంటారు. వీరితోపాటు ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ), హెచ్‌ఆర్ జేఎండీ పోస్టులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఏపీ జెన్‌కో ఎండీగా 2023 ఏప్రిల్‌లో చేరిన కె.వి.ఎన్.చక్రధర్‌బాబు అనేక ప్రాజెక్టుల స్థాపనకు నేతృత్వం వహించారు.
థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో యూనిట్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి కృష్ణపట్నం, వీటీపీఎస్‌లో 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామరర్ధ్యాన్ని అందుబాటులోకి తేవడంలో ప్రముఖపాత్ర పోషించారు. అయితే ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో అధికారుల మధ్య పొసగడం లేదనే గుసగుసలు విద్యుత్‌శాఖలో చాలాకాలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో ఉన్న అధికారి చక్రధర్‌బాబుకి ప్రాధాన్యం ఇవ్వడం లేదనే వాదనలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి.
తన ప్రమేయం లేకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కావాలనే తనను పక్కనపెట్టడం వంటి సంఘటనలతో విసిగిపోయిన చక్రధర్‌బాబు కొద్దిరోజుల కిందట ఆరోగ్య సమస్యలను కారణంగా చూపించి దీర్ఘకాలసెలవు పెట్టారు. తరువాత ప్రభుత్వ పెద్దలు బుజ్జగించడంతో విధుల్లో చేరారు. అయినా అసంతృప్తిగానే ఉంటున్న ఆయన డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఐఏఎస్ అధికారుల బదిలీల్లో ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ బదిలీ అయ్యారు. ఆ స్థానంలో ఇన్‌చార్జి బాధ్యతల్ని అక్కడే ఉండే ఏపీ జెన్‌కో ఎండీకి ఇవ్వాల్సి ఉంది.
కానీ అందుకు భిన్నంగా ఎక్కడో ఉన్న ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృధ్వీతేజ్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా అత్యంత ప్రాధాన్యత కలిగిన విజిలెన్స్ విభాగానికి కూడా ఆయన్నే ఇన్‌చార్జి చేశారు. నిజానికి ఒకటి, రెండురోజుల్లో పృధ్వీతేజ్ కూడా బదిలీ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో చక్రధర్‌బాబును కాదని ఆయనకు ప్రాధాన్యతనివ్వడానికి అంతర్గత విభేదాలే కారణమని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. చక్రధర్‌బాబు కేంద్ర సర్వీసులకు వెళ్లేవరకు కూడా జెన్‌కోలో కొనసాగించే అవకాశాలు లేవంటున్నారు.