‘పుర’ పోరుకు ముమ్మర ఏర్పాట్లు

Field is preparing for municipal elections in AP - Sakshi

ఫిబ్రవరి చివర్లో.. లేదా మార్చి మొదటి వారంలో పోలింగ్‌

వారం రోజుల్లో వార్డుల పునర్విభజన పూర్తి

ఫిబ్రవరి మొదటి వారానికల్లా రిజర్వేషన్ల ఖరారు

ఫిబ్రవరి 10కల్లా ఓటర్ల తుది జాబితాలు

కార్యాచరణను వేగవంతం చేసిన పురపాలక శాఖ

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ,  పంచాయతీ ఎన్నికలు పూర్తికాగానే అదే ఊపులో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరి చివరి వారంలోగానీ మార్చి మొదటి వారంలోగానీ మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలను వేగవంతం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 110 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. వాటిలో 14 కార్పొరేషన్లు, 5 సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీలు, 7 స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీలు, 12 మొదటి గ్రేడ్‌ మున్సిపాలిటీలు, 26 రెండో గ్రేడ్‌ మున్సిపాలిటీలు, 22 మూడో గ్రేడ్‌ మున్సిపాలిటీలు, 24 నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో కాకినాడ కార్పొరేషన్‌కు 2017లో ఎన్నికలు నిర్వహించారు. మరోవైపు.. కొత్తగా 10 మున్సిపాలిటీలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. వీటిపై వారం రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.

ఊపందుకున్న వార్డుల పునర్విభజన
2011 జనాభా లెక్కల ఆధారంగా మున్సిపాలిటీలలో వార్డుల పునర్విభజన ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటికే దాదాపు 90 పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల సంఖ్యను పెంచారు. మిగిలిన మున్సిపాలిటీలలోనూ ఈ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు వీలుగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు నిర్ణయించే దిశగా పురపాలక శాఖ కార్యాచరణను వేగవంతం చేసింది. కార్పొరేటర్లు, మేయర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేయడం, వార్డుల పునర్విభజనపై ప్రభుత్వానికి ఉన్న అధికారాలను రాష్ట్ర మున్సిపల్‌ కమిషనర్‌– డైరెక్టర్, జిల్లా కలెక్టర్లకు దఖలుపరుస్తూ పురపాలక శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన ప్రతిపాదనలను మూడ్రోజుల్లో పూర్తిచేయాలని పురపాలక కమిషనర్‌– డైరెక్టర్‌ మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. మున్సిపాలిటీల నుంచి ప్రతిపాదనలు వచ్చిన వెంటనే పరిశీలించి ఆమోదించాలని భావిస్తున్నారు. అలాగే, కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లకు రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు నిర్ధారించనున్నారు. వీటితోపాటు కార్పొరేటర్లు, కౌన్సిలర్ల రిజర్వేషన్ల ప్రక్రియను ఫిబ్రవరి మొదటి వారానికి పూర్తిచేయాలని భావిస్తున్నారు.

ఫిబ్రవరి 10కల్లా తుది ఓటర్ల జాబితా
మున్సిపల్‌ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాలను రూపొందించే ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. ఇప్పటికే ఉన్న ఓటర్ల జాబితాల్లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తారు. అభ్యంతరాలు, వినతులను పరిశీలించిన మీదట మొత్తం ప్రక్రియను ఫిబ్రవరి 10 నాటికి పూర్తిచేసి తుది ఓటర్ల జాబితాలను సిద్ధంచేయాలని మున్సిపల్‌ కమిషనర్లను పురపాలక శాఖ ఆదేశించింది. 

పరోక్ష పద్ధతిలోనే మేయర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్ల ఎన్నికలు
గతంలో నిర్వహించిన విధంగానే మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మొత్తం మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియను మార్చి మొదటి వారానికల్లా ముగించాలని పురపాలక శాఖ భావిస్తోంది. అంటే.. ఫిబ్రవరి చివరి వారంలోగానీ మార్చి మొదటి వారంలోగానీ పోలింగ్‌ నిర్వహించే అవకాశాలున్నాయి. కార్పొరేటర్లు/కౌన్సిలర్ల ఎన్నికలు ముగిసిన అనంతరం మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్ల ఎన్నికలను నిర్వహిస్తారు. అందుకు వీలుగా ఎన్నికల సన్నాహాలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆయా మున్సిపల్‌ కమిషనర్లను పురపాలక శాఖ కమిషనర్‌–డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ ఆదేశించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top