ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకున్నారు.
డోర్నకల్ (కర్నూలు) : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం తొడేళ్లగూడెం గ్రామానికి చెందిన చెక్కల ఉపేంద్ర(33) తన భర్త శ్రీనుతో కలిసి తమకున్న ఎకరం ఇరవై గుంటల్లో పత్తి సాగు చేస్తోంది. పెట్టుబడి కోసం శ్రీను పలు చోట్ల చేసిన అప్పులు సుమారు రూ.2.30 లక్షల వరకు చేరాయి. ఇంత చేసినా పంటకు సరిగా నీరందలేదు.
ఇటీవల రెండుసార్లు వ్యవసాయ బావి కరెంటు మోటారు కాలిపోయింది. మనస్తాపానికి గురైన ఉపేంద్ర సోమవారం తన పత్తి చేను వద్ద పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను భర్తతోపాటు స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ వివరించారు.