అమ్మను కాపాడారిలా..

Feeder Ambulance Technician Service Pregnant Safe Visakhapatnam - Sakshi

ఫీడర్‌ అంబులెన్స్‌ టెక్నీషియన్‌ అద్వితీయ సేవలు

మూడు కిలోమీటర్లు డోలి మోసి..

ఆపై పెదబయలు పీహెచ్‌సీకి గర్భిణి తరలింపు

సుఖ ప్రసవంతో తల్లీ బిడ్డ క్షేమం

విశాఖపట్నం ,పెదబయలు (అరకులోయ): భారీ వర్షం.. కల్వర్టు కొట్టుకుపోవడంతో మూసుకుపోయిన మార్గం.. గ్రామం దాటాలంటే గెడ్డ మీదుగా 3 కిలోమీటర్లు నడవాల్సిందే.. ఈ అవరోధాలేవీ ఆ వైద్య ఉద్యోగి అంకిత భావాన్ని అడ్డుకోలేకపోయాయి. పురిటి నొప్పులతో అవస్థ పడుతున్న నిండు చూలాలిని బంధువుల సాయంతో డోలీలో తీసుకొచ్చి పీహెచ్‌సీకి తరలించారు. తల్లితోపాటు బిడ్డను బతికించారు. పెదబయలు మండలం సీకరి పంచాయతీతో జరిగింది ఈ అపురూప సంఘటన. అరమెర గ్రామానికి చెందిన కోడ సావిత్రి తొలి కాన్పు కోసం పురిటి నొప్పులు పడుతోంది. మంగళవారం ఉదయం సమాచారం అందుకున్న ఫీడర్‌ అంబులెన్స్‌ ఎమర్జెన్సీ టెక్నీషియన్‌ లకే అశోక్‌కుమార్‌ వెంటనే బయలుదేరారు.

ఇటీవలి వర్షాలకు రోడ్డు, కల్వర్టు కొట్టుకుపోవడంతో గ్రామంలోనికి వెళ్లడానికి మార్గం లేదు. 3 కిలోమీటర్ల ముందే వాహనాన్ని నిలిపేయాల్సివచ్చింది. తనకెందుకులే అని ఊరుకోలేదా టెక్నీషియన్‌.. అక్కడ నుంచి నడుచుకుని వెళ్లి డోలీ కట్టుకుని మూడు కిలోమీటర్లు బంధువుల సాయంతో మోసి, గెడ్డ దాటించారు. అక్కడ నుంచి పెదబయలు పీహెచ్‌సీకి తరలించారు. తెచ్చిన రెండు గంటల వ్యవధిలోనే సుఖ ప్రసవం అయ్యింది. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. ఫీడర్‌ అంబులెన్స్‌ ఎమర్జెన్సీ టెక్నీషియన్‌ లకే అశోక్‌కుమార్‌కు గర్భిణి బంధువులు కృతజ్ఞతలు చెప్పగా.. వైద్యాధికారి, సిబ్బంది అభినందనల్లో ముంచెత్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top