కూతురు లేదని ఆగిన తండ్రి గుండె

Father Died With Heart Stroke Listen Daughter Death News - Sakshi

రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన కుమార్తె

అంత్యక్రియల అనంతరం తండ్రికి గుండెపోటు

ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి

తండ్రీకుమార్తెల మృతితో చిలకలూరిపేటలో విషాదఛాయలు

చిన్నతనంలో కూతుర్ని గుండెలపై పెట్టుకుని మమకారంగా పెంచుకున్నాడు. కన్న బిడ్డ కేర్‌మని ఏడిస్తే తాను కన్నీళ్లు కార్చాడు. అల్లుడు కూడా తన ఊరే కావడంతో బిడ్డ కళ్లెదుటే ఉంటుందని మురిసిపోయాడు. తాను మెట్టినింటికి వెళ్లాక కూడా నాన్న కాస్త నలతగా ఉన్నాడని తెలిస్తే చాలు ఆ కూతురి కాలూచేయి ఆడేవి కాదు. ఆయన గొంతులో ప్రేమామృతం పోసే దాకా నిలిచేవి కాదు. ఇలా అల్లుకున్న తండ్రీకూతుళ్ల ప్రేమానురాగాలపై విధి విషం చిమ్మింది. రోడ్డు ప్రమాదం రూపంలో కూతుర్ని చిదిమేసింది. ‘నాన్నా’ అనే ఆ కూతురి పిలుపు ఇక వినబడదని ఆ తండ్రి గొంతు మూగబోయింది. ఏడ్చి ఏడ్చి కన్నీరింకిన ఆయన గుండె కూడా ఆగిపోయింది. ఒక్క రోజు వ్యవధిలోనే తండ్రీకూతుళ్ల మృత్యువాత ఘటన చిలకలూరిపేటలో విషాద ఛాయలు నింపింది.

గుంటూరు, చిలకలూరిపేటరూరల్‌: కుమార్తె మరణాన్ని జీర్ణించుకోలేక కన్న తండ్రి గుండె ఆగింది. ఈ సంఘటన చిలకలూరిపేట పట్టణంలోని ఆదివారం చోటు చేసుకుంది.ఒకరి వెంట ఒకరు మరణం ఇలా ...
పట్టణంలోని కొమరవల్లిపాడు (పాటి మీద) జెండా చెట్టు సమీపంలో చింతకాయల శివనాగేశ్వరరావు(64) నివసిస్తున్నారు. పసుమర్రు గ్రామ శివారులో డీఆర్‌ఎన్‌ఎస్‌సీవీఎస్‌ డిగ్రీ కళాశాలలో రికార్డ్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించి ఇటీవల పదవీ విరమణ చేశారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

ఒక కుమార్తె మారుబోయిన అనంతలక్ష్మి(45)ని చిలకలూరిపేటలోనే ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఒక కుమార్తె. శనివారం భర్తతో కలిసి గుంటూరు దంత వైద్యశాలకు వెళ్లి చిలకలూరిపేటకు తిరిగి వస్తుండగా కోండ్రుపాడు వద్ద  ద్విచక్రవాహనం అదుపు తప్పింది. అనంతలక్ష్మికి తీవ్ర గాయాలవడంతో కాటూరి వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఆదివారం కుమార్తె దహన సంస్కారం నిర్వహించిన అనంతరం తండ్రి చింతకాయల శివనాగేశ్వరరావు కుమార్తె మృతిని జీర్ణించుకోలేక గుండె నొప్పితో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వైద్యశాలకు తరలించేలోగా నాగేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. తండ్రీకుమార్తెల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు   మున్నీరవుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top