సారూ.. మా నోట్లో మట్టి కొట్టొద్దు!

Farmers Protesting About Kalyanapuloa Reservior In Visakhapatnam - Sakshi

సాక్షి, రావికమతం(చోడవరం) : అప్పులు చేసి పెట్టుబడులు పెడితే ప్రకృతి సహకరించక పంటంతా నాశనం అయిపోయింది. ఆదుకుంటుందని ఆశలు పెట్టుకున్న గత ప్రభుత్వం హయాంలో నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు అనుమతులిచ్చి మా నోట మట్టి కొట్టిందని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ ఆయకట్టు రైతులు కన్నీరు కారుస్తున్నారు. ఈ అనుమతులు తక్షణమే వెనక్కు తీసుకోవాలంటూ కళ్యాణపులోవ రిజర్వాయర్ల పరిరక్షణ కమిటీ ఆందోళనలు, పత్రికల్లో వస్తున్న కథనాలతో పాటు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ  కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

దీంతో అన్ని శాఖల అధికారులతో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ క్రమంలో జెడ్‌.కొత్తపట్నంలో గురువారం జరిగిన సభకు ఇరిగేషన్‌ ఎస్‌ఈ సూర్యకుమార్, మైన్స్‌ ఏడీలు ప్రసాద్, వెంకట్రావు, నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు, అటవీశాఖ అధికారి శివప్రసాద్, పంచాయతీ అధికారి రమణయ్యల సమక్షంలో రైతుల అభిప్రాయాలు సేకరించారు. రైతులకు మేలు చేయడమే ప్రభుత్వ ధ్యేయమని నిర్భయంగా మీ అభిప్రాయాలు చెప్పొచ్చని భరోసా ఇవ్వడంతో గుండెల్లో ఆవేదనను ఇలా ఒక్కొక్కరిగా సభ ముందుంచారు.

5 వేల ఎకరాల్లో పంటలు నాశనం కళ్యాణపులోవ ప్రాంతంలో మైనింగ్‌ క్వారీ లారీలు భారీలోడ్‌లుతో నడవటం వల్ల ఇప్పటికే రోడ్లన్నీ పూర్తిగా గుంతలు పడ్డాయి. రోడ్డు బాగాలేక 108 రాలేని పరిస్థితి. 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 50 ఏళ్లలో రిజర్వాయర్‌ ఎండిపోయి 5 వేల ఎకరాల్లో పంటలు పండడం లేదు. కల్యాణపులోవ రిజర్వాయర్‌లో ఏటా రూ.25 లక్షల చేప పిల్లలు వేసి ఆ మత్స్య సంపద ద్వారా జీవనోపాధి పొందుతున్నాం. ఈ ఏడాది నారుపోతలు వద్దంటూ అధకారులు చాటింపులు వేస్తున్నారు.

పంట లేకుంటే మేమెలా బతకాలి. టీడీపీ ప్రభుత్వం పుణ్యమా అని మా బతుకులు రోడ్డునపడ్డాయంటూ రైతులు, మత్స్యకారులు కన్నీరు కార్చారు. కల్యాణపులోవ రిజర్వాయర్‌ పరీవాహక ప్రాంతం సామాలమ్మ కొండపై పలు గ్రానైట్‌ కంపెనీలు విచ్చలవిడి మైనింగ్, పేలుళ్ల కారణంగా ఊట గెడ్డలు కనుమరుగైపోయాయి. రిజర్వాయర్‌ మనుగడకే ముప్పు మహారాష్ట్రలో ఇటీవలే ఒక రిజర్వాయర్‌ కట్ట తెగి పోయి మూడు ఊళ్లు కొట్టుకుపోయాయి. అధికారులు తేరుకోకపోతే ఇక్కడా అలాంటి ముప్పు రావచ్చు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement
Back to Top