మోకా భాస్కరరావు హత్యతో ఉలికిపాటు 

Farmers Market Yard Chairman Moka bhaskara Rao Assassinate Incident - Sakshi

పక్కా పథకం ప్రకారమే హత్య చేసిన ఆగంతకులు 

పోలీసుల అదుపులో నిందితులు

నగరంలో ఉద్రిక్తత.. ఎటువంటి అల్లర్లు చోటుచేసుకోకుండా పోలీసుల చర్యలు 

సాక్షి, మచిలీపట్నం/కోనేరుసెంటర్‌: ప్రశాంత నగరమైన బందరులో కలకలం రేగింది. నగరం నడిరోడ్డున అందరూ చూస్తుండగా పక్కా ప్రణాళికతో ఓ సీనియర్‌ రాజకీయ నాయకుడు హత్యకు గురవడం సంచలనం రేపింది. మత్స్యకార వర్గాల్లో మంచి పట్టున్న వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు మోకా భాస్కరరావు (57) పాశవికంగా హత్యకు గురవడం ఆందోళన రేపుతోంది. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతో ఆయన అనుచరులు పథకం ప్రకారం ఈ ఘాతుకానికి ఒడిగట్టారని వార్తలు గుప్పుమనడంతో నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. 

రద్దీగా ఉండే ప్రాంతంలో.. 
ఉదయం 11.30 గంటల సమయం. నిత్యం రద్దీగా ఉండే కోనేరు సెంటర్‌కు కూతవేటు దూరంలో ఉన్న చేపల మార్కెట్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావుపై ఓ ఇద్దరు ఆగంతుకులు ఒక్కసారిగా దూసుకొచ్చారు.  
నిల్చొన్న భాస్కరరావును తోసేయడంతో కిందపడి పోయాడు. అంతే అందరూ చూస్తుండగానే తమ వెంట తెచ్చుకున్న కత్తితో నేరుగా ఛాతిలోకి పొడిచారు.  
ఆ పోట్లకు జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ పేలిపోయింది. వంటిపై చొక్కా కాలిపోయింది. శరీరంపై కాలిన గాయాలయ్యాయి.  
గుండెల్లో పొడవడంతో తీవ్ర రక్తస్రావమైన భాస్కరరావును ఆటోలో హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. 

పక్కా స్కెచ్‌..! 
ఈ హత్య పూర్తిగా పథకం ప్రకారమే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. దీనిలో నలుగురు పాల్గొన్నట్టుగా, వారిలో ఇరువురు 18–22 ఏళ్ల లోపు వారే అంటున్నారు.  
కనీసం నాలుగైదు రోజుల నుంచి భాస్కరరావు కదలికలను గమనిస్తూ ఆయన వెళ్లే ప్రతిచోటా రెక్కీ నిర్వహించారని తెలియవచ్చింది.  
ఈ ఘటనలో ఇరువురు ప్రత్యక్షంగా పాల్గొనగా, మరో ఇరువురు మెయిన్‌ రోడ్‌లో బైకులపై వేచి ఉన్నట్టుగా సీసీ ఫుటేజ్‌ను బట్టి తెలుస్తోంది.  

టీడీపీ నాయకుల ఇళ్ల వద్ద బందోబస్తు 
రాజకీయ ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందని ప్రచారంతో తమ పార్టీ నేతలపై దాడులు జరిగే అవకాశాలున్నాయని తమకు రక్షణ కలి్పంచాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఎస్పీ రవీంద్రనాథ్‌బాబును కలిసి అభ్యర్థించారు. ఎస్పీ ఆదేశాలతో మాజీ మంత్రి కొల్లు ఇంటితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు తదితరుల ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే నగర ప్రధాన కూడళ్లల్లో కూడా పోలీస్‌ పికెట్‌లు ఏర్పాటు చేశారు. 

కన్నీటి పర్యంతం.. 
భాస్కరరావు హత్యకు గురైన వార్తతో బందరు నగరం శోకసంద్రంలో మునిగిపోయింది. తన ఆప్తుడ్ని కోల్పోయిన రాష్ట్ర మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. 

ఆ బుల్లెట్‌ చింత చిన్నిదే 
హత్యనంతరం మెయిన్‌రోడ్డు వైపు పరుగు తీసిన నిందితుల్లో ఒకరు ఓ బుల్లెట్‌ ఎక్కారు. ఆ బుల్లెట్‌ ఎవరదని పోలీసులు ఆరా తీశారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా ఆ బుల్లెట్‌ ఈ హత్యోదంతంలో ప్రధాన నిందితునిగా అనుమానిస్తున్న చింత చిన్నకు చెందినదేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు ఆర్‌ పేట సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. చింత చిన్నీయే స్వయంగా తన బుల్లెట్‌ ఏపీ 16వీఎల్‌ 6669తో వచ్చి నిందితుడ్ని ఎక్కించుకుని పరారైనట్టుగా భావిస్తున్నారు.

‘బాచీ బాబాయ్‌’ ప్రస్థానం
కోనేరు సెంటర్‌(మచిలీపట్నం): మచిలీపట్నంలో సోమవారం హత్యకు గురైన మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు రాజకీయ ప్రస్థానం ముప్‌పై ఏళ్ల క్రితం ప్రారంభం అయ్యింది. ఆది నుంచి మంత్రి పేర్ని నాని కుటుంబం వెంటే నడుస్తూ వారికి నమ్మిన బంటుగా ముద్ర వేసుకున్నారు. తన సామాజిక వర్గంలో ఎవరికి ఏ చిన్న కష్టమొచ్చినా నేనున్నానంటూ వారికి అండగా నిలుస్తూ అందరితో ముద్దుగా బాచీ బాబాయ్‌ అని పిలిపించుకునే వారు.  

భాస్కరరావు తండ్రి మోకా రామయ్య మాజీ మంత్రి పేర్ని కృష్ణమూర్తి హయాంలో కౌన్సిలర్‌గా పనిచేశారు. ఆ తర్వాత తన భార్య మోకా వెంకటేశ్వరమ్మను అదే వార్డు నుంచి వరుసగా రెండుసార్లు కౌన్సిలర్‌గా గెలిపించుకున్నారు. 
మత్స్యకార కుటుంబానికి చెందిన భాస్కరరావు మత్స్యకారుల సమస్యలపై నిరంతంర పోరాటాలు చేస్తూ ఉల్లింగిపాలెం మత్స్య కారులకు పెద్ద దిక్కుగా నిలిచారు. తండ్రి, భార్యను గెలిపించుకున్న భాస్కరరావు ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి కాంగ్రెస్‌ పార్టీ తరఫున 1995–2000 మధ్య 24వ వార్డు నుంచి గెలుపొంది తనకు తిరుగు లేదని నిరూపించారు. బందరు మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా వరుసగా రెండు పర్యాయాలు సేవలందించారు. 

పోలీసుల అదుపులో నిందితులు
హత్యోదంతంపై కేసు నమోదు చేసిన ఆర్‌ పేట పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్పీ రవీంధ్రనాథ్‌బాబు ఆదేశాలతో ఏఎస్పీ వకుల్‌ జిందాల్, డీఎస్పీ మహబూబ్‌ బాషా విచారణ చేపట్టారు. ఇందుకోసం మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సీటీ ఫుటేజ్‌ ఆధారంగా గుర్తించిన నిందితుల కోసం మరో నాలుగు బృందాలు వేట మొదలు పెట్టాయి. హత్య జరిగిన ఏడు గంటలు తిరక్కుండానే నిందితుల్లో ఇరువుర్ని సోమవారం రాత్రి అదుపులో తీసుకున్నారు. వీరిని గూడూరు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు. మరొక వైపు ఈ హత్య చేయించినట్టుగా అనుమానిస్తున్న చింతా చిన్ని కుటుంబం మొత్తం పరారీలో ఉన్నట్టుగా తెలియవచ్చింది.

మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో నిందితుడు చింతా చిన్ని   

కుట్రతోనే హత్య.. 
బాబాయి హత్య మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుట్రతోనే జరిగిందని మోకా భాస్కరరావు అన్న కుమారుడు మోకా రాజేష్‌ కన్నా ఆరోపించారు. ఆస్పత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా, సామాజికంగా ఎదుగుతున్న బాబాయిని చూసి ఓర్వలేని కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే టీడీపీ నాయకులు చింతా చిన్నా అతని అనుచరులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని ధ్వజమెత్తారు. గుమ్మటాలచెరువు విషయంలో బాబాయి భాస్కర రావుకు, మాజీ   మంత్రి కొల్లు రవీంద్రకు మధ్య వివాదం జరిగిందన్నారు. అప్పుడే కొల్లు రవీంద్ర బాబాయినుద్దేశించి ‘నేను  మంత్రిగా చేశాను.. గుర్తు పెట్టుకో.. నీ అంతుచూస్తా’నంటూ తీవ్ర స్థాయిలో బెదిరించాడని, ఇప్పుడు అన్నంత పని తన అనుచరులతో చేసి చూపించాడని, ఇది ముమ్మాటికీ కొల్లు రవీంద్ర పనేనని ఆరోపించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top