మట్టి మనిషికి.. గట్టి సాయం

Farmers Happy About YSR Raithu Bharosa In Vijayawada - Sakshi

సాక్షి, మచిలీపట్నం : అన్నదాతల ఇంట ఆనందం. ఆదుకునే అన్నొచ్చాడంటూ రైతన్నలు సంబరపడిపోతున్నారు. ఇక మా కష్టాలన్నీ ఈడేరినట్టేనని ఎగిరి గంతేస్తున్నారు. రైతు రాజ్యమని కీర్తిస్తున్నారు. ‘వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎంసీ కిసాన్‌’ కొండంత భరోసానిస్తోందంటున్నారు. నవరత్నాల్లో ఇచ్చిన హామీకి మించిసాయమందిస్తుండడంతో ఆనందానికి అవధుల్లేకుండా పోయిందంటూ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కేవలం రెండురోజుల్లోనే రెండున్నర లక్షల మంది రైతుల ఖాతాల్లో భరోసా సొమ్ము జమ కావడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.  ‘వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎంసి కిసాన్‌’ పథకం కింద ఇప్పటి వరకు జిల్లాలో 3,19,369 మంది అర్హులుగా తేల్చారు. ఈ నెల15వ తేదీ ఈ పథకానికి శ్రీకారం చుట్టగా, గడిచిన రెండు రోజుల్లోనే ఏకంగా 2,53,529 మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా సొమ్ము జమ చేశారు. కిసాన్‌ లబ్ధిదారులతో పాటు కౌలు రైతులు, గిరిజన రైతులు, మిగిలిన రైతులకు కూడా ఒకేసారి డబ్బులు జమ కావడంతో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాది నుంచి ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో పెట్టుబడి సాయం కింద రూ.50వేలు అందించాలన్నది హామీ. కానీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టడమే కాదు ఏటా ప్రకటించిన రూ.12,500ను రూ.13,500లకు పెంచారు. పైగా నాలుగేళ్ల పథకాన్ని ఐదేళ్లు పొడిగించారు. మేలో రూ.7500, రబీసాగు ముందు అక్టోబర్‌లో రూ.4వేలు, సంక్రాంతికి రూ.2వేలు చొప్పున మూడువిడతల్లో సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటి వరకు 3.19లక్షల మంది అర్హులు
జిల్లాలో 6,19,772 రైతు ఖాతాలుంటే ఇప్పటి వరకు 3,19,369 మంది అర్హులుగా తేల్చారు. ఇప్పటి వరకు జమైన వారిలో పీఎం కిసాన్‌ లబ్ధిదారులు 2,02,809 మంది ఉండగా, ఇప్పటి వరకు ఎలాంటి లబ్ధి పొందనివారు 41,138 మంది, కౌలు దారులు 8957 మంది, రిజర్వు ఫారెస్ట్‌ రైట్‌ (ఆర్‌ఒఎఫ్‌ఆర్‌) కింద అటవీ భూములు సాగు చేస్తున్న గిరిజన రైతులు 625 మంది ఉన్నారు. కిసాన్‌ లబ్ధిదారులకు ఇప్పటికే పీఎం కిసాన్‌ ద్వారా రూ.4 వేలు జమైనందున ప్రస్తుతం వారికి రూ.7500 చొప్పున జమ చేశారు. మిగిలిన రూ.2 వేలను సంక్రాంతి రోజున జమ చేయనున్నారు. ఇక కొత్తగా అర్హత పొందిన రైతులకు ప్రస్తుతం రూ.9,500 జమ చేయగా, రబీ సాగు కోసం అక్టోబర్‌ నెలాఖరు నాటికి మరో రెండువేలు జమచేయనుండగా, మిగిలిన రూ.2 వేలు జనవరిలో జమ చేయనున్నారు. ఇక ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాదారులైన గిరిజన రైతులతో పాటు కౌలుదారులకు ప్రస్తుతం రూ.11,500 చొప్పున జమ చేశారు. మిగిలిన రూ.2వేలను జనవరిలో సంక్రాంతి పండుగరోజున జమచేయనున్నారు. ఇక మిగిలిన 65,840 మందికి రానున్న రెండుమూడు రోజుల్లో జమవుతుందని వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు.

ఇక ప్రతి సోమవారం భరోసాయే..
మాజీ సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ అధ్యక్షులతో పాటు ప్రభుత్వ ఉద్యోగి ఉన్న రైతు కుటుంబాలకు, చనిపోయిన అర్హులైన రైతుల భార్యలు, వారి వారసులకు కూడా వర్తింపజేయడంతో అర్హుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు న్నాయి. వీరి కోసం ప్రతి సోమవారం ప్రత్యేకంగా భరోసా గ్రీవెన్స్‌ నిర్వహించనున్నారు.

                         పామర్రులో జరిగిన రైతు భరోసా సమావేశానికి హాజరైన మహిళా రైతులు

సీఎం జగన్‌ రైతుల పక్షపాతి
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల సంక్షేమం కోసం పనిచేసే నాయకుడు. రైతుల బాధలను తెలుసుకుని వ్యవసాయం రోజుల్లో సాగుకోసం పెట్టుబడి లేకపోవటం ఇతరుల నుంచి అధిక వడ్డీలకు అప్పులుచేసి పంటలు సాగుచేసేవాళ్లం. కాని ఇప్పుడు పెట్టుబడి సాయం కింద రూ. రెండు దఫాలుగా రూ.9,500 నగదు నా బ్యాంకుఖాతాలో జమ చేశారు. జీవితంలో ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదు. రైతులందరూ సీఎంకు రుణపడి ఉంటాం. 
–మర్రి వరప్రసాద్, రైతు, పేరకలపాడు

జగనన్నకు రుణపడి ఉంటా
నాకు ఎకరం భూమి ఉంది. పంటకు రూ.25 వేలు ఖర్చు అవుతోంది. బ్యాంకు ఇచ్చే రుణం సరిపోక బయట అధిక వడ్డీలకు అప్పులు చేసి ఇన్నాళ్లు సాగు నెట్టుకొచ్చాను. ముఖ్యమంతి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా పధకం పేరుతో నా బ్యాంకు ఖాతాలో రూ.7,500 జమ చేశారు. కొంతలో కొంతైన సాగు ఖర్చులకు ఈ నగదు ఉపయోగపడుతుంది. జగనన్నకు రైతులంతా రుణపడి ఉంటాం. 
–బెజవాడ శ్రీనివాసరావు,  రైతు, సీతారామపురం

పేద, మధ్య తరగతి రైతులకు వరం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు, రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ రైతు భరోసా పేద, మధ్య తరగతి రైతులకు వరం లాంటిది. ఇచ్చిన హామీ కన్నా ముందుగానే మిన్నగా అమలు చేసిన రైతు బాంధువుడు వైఎస్‌ జగన్‌కు రైతులంతా రుణపడి ఉంటాం. ఎప్పుడు ఇంత త్వరగా రైతులకు మేలు చేసిన వారిని చూడలేదు.
–కొడాలి వెంకటేశ్వరరావు,  రైతు, ఘంటసాల

అవసరానికి అక్కరకొచ్చింది..
రైతుల స్థితిగతులు గుర్తించి రైతుల అవసరాలకు అనుగుణంగా వైఎస్సార్‌ రైతు భరోసా అందించడం సీఏం జగనన్నకే సాధ్యమైంది. ప్రస్తుతం పొలాలకు ఎరువులు, మందులు పిచికారి చేయాల్సిన సమయంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేసి సాయం అందించి రైతులపై సీఏంకు ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. దీంతో సాగు పెట్టుబడికి ఎంతో ఉపయోగంగా ఉంటోంది.
 –మాడెం వెంకటశ్రీను, రైతు, లంకపల్లి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top