చీపురుపల్లిలో నకిలీనోట్ల కలకలం...

Fake Notes in Cheepurupalli Vizianagaram - Sakshi

భోగీ సంతలో బయటపడిన రూ.200ల నకిలీ నోటు

మోసపోతున్న చిరు వ్యాపారులు, ప్రజలు

విజయనగరం, చీపురుపల్లి: చీపురుపల్లి కేంద్రంగా మరోసారి నకిలీనోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. చాలా కాలం కిందట ఎన్నోసార్లు నకిలీనోట్లు చలామణి జరిగిన నేపథ్యంలో మరోసారి పట్టణంలో దొంగనోట్లు బయటపడడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భోగీ సంతలో రూ.200 నోటు ఓ కూరగాయల వ్యాపారి తిరిగి వినియోగదారునికి ఇచ్చే సమయంలో అది నకిలీ నోటుగా గుర్తించారు. దీంతో అటు కూరగాయల వ్యాపారి, ఇటు వినియోగదారుడు అవాక్కయ్యారు. ఎవరిచ్చారో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని రూ.200 దొంగనోటు చలామణిలోకి వచ్చింది. అయితే రూ.200 నోట్లు కొద్ది కాలం కిందటే అధికారికంగా చలామణిలోకి వచ్చాయి. ఇంతలోనే నకిలీనోట్లు చలామణిలోకి రావడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ప్రతి ఏటా భోగీ రోజున చీపురుపల్లిలో సంత నిర్వహిస్తుంటారు. ఈ సంతకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు. ఇదే అదునుగా నకిలీనోట్లను మార్చేయవచ్చని భావించిన ముఠా వాటిని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టినట్లు జనం చర్చించుకుంటున్నారు. అందులో భాగంగానే సోమవారం మధ్యాహ్నం ఓ కూరగాయల వ్యాపారి తన దగ్గర కూరగాయలు కొనుగోలు చేసిన వ్యక్తికి చిల్లరలో భాగంగా రూ. 200 నోటు ఇవ్వడంతో అది నకిలీదిగా వినియోగదారుడు గుర్తించాడు. దాదాపు  జిరాక్స్‌ నోటుగా కనిపించడంతో పాటు నోటు మధ్యలో ఉండే సిల్వర్‌ రంగు త్రెడ్‌ భాగంలో చెమ్‌కీ పూసినట్లు కనిపించింది. దీంతో  ఆ వ్యాపారి తనకు ఆ నోటు ఎవరిచ్చారో తెలియక లబోదిబోమన్నాడు.  

గతంలోనూ చలామని..
చీపురుపల్లిలో నకిలీనోట్లు చలామణి ఇదేం కొత్తకాదు. మెయిన్‌రోడ్‌లో కిరాణా దుకాణాలు, టీ దుకాణాల వద్ద నకిలీనోట్లు బయటపడ్డాయి. ఐదారు సంవత్సరాల కిందట సాక్షాత్తూ ఓ టీ దుకాణదారుడి వద్ద నకిలీనోటు లభ్యమవడంతో పోలీస్‌ కేస్‌ కూడా నమోదైంది. రెండేళ్ల కిందట కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర సమయంలో భారీ ఎత్తున రూ.లక్షల్లో నకిలీనోట్లతో నిందితులు చీపురుపల్లిలో పోలీసు బృందాలకు దొరికినప్పటికీ పైస్థాయి ఒత్తిడి మేరకు విషయం బయటకు రాకుండా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యాల నడుమ మరోసారి నకిలీనోటు కలకలం రేపడంతో నియోజకవర్గ ప్రజలు ఆందోళనలో పడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top