ఒకే ముఖం.. ఓట్లు అనేకం...

Fake And Double Voter Id Cards in YSR Kadapa - Sakshi

ఎక్కడ చూసినా కనిపిస్తున్న బోగస్‌ ఓట్లు

రెండు, మూడు అడ్రస్సులు..ఒక ఓటు

అన్ని నియోజకవర్గాల్లో కనిపిస్తున్న దొంగ ఓట్లు

ఓట్లు దండుకునేందుకు కుయుక్తులు

టీడీపీ నేతల ముందస్తు వ్యూహం

సాక్షి కడప : ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీని ఢీ కొట్ట లేమనుకున్నారో..అరకొర తేడా ఉంటే మనమూ ముందుకు వరుసకు రావచ్చుకున్నారో తెలియదుగానీ దొంగ ఓట్లతో నెగ్గాలని టీడీపీ నేతలు వ్యూహం రచించారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. జిల్లాలో  ఎక్కడా చూసినా ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేస్తూ..ఒకే ఓటుకు కట్టుబడకుండా రెండు, మూడు చోట్ల ఓట్లు వేసేందుకు చేసిన పన్నాగం బట్టబయలైంది. రాష్ట్రంతోపాటు జిల్లాలోనూ బోగస్‌ ఓట్లు నమోదైనట్లు ఓటర్‌ అనలిస్ట్‌ అండ్‌ స్టాటజీ టీం (వాస్ట్‌) స్పష్టం చేసింది. దీంతో దొంగ ఓట్లు బయటపడుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ ముఖం ఒకటి..ఓట్లు అనేకం కనిపిస్తున్నాయి. కొన్ని అడ్రస్సులు మార్చి ఒకే ఓటరు పలుచోట్ల ఓటు వేసుకునేందుకు నమోదు చేసుకున్న వైనం కూడా బహిర్గతమైంది. ఎందుకిలా చేశారో ఎవరికీ అర్థం కావడం లేదు.  రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో  దొంగ  ఓట్ల ద్వారా కనీసం డిపాజిట్లకు చేరువ కావచ్చని ‘దేశం’ నేతలు ప్రణాళికలు రూపొందించినట్లు చర్చ జరుగుతోంది.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో ఓట్ల రాజకీయం సాగుతోంది.

ఓటు ఒకటి.. ఊర్లు రెండు
జిల్లాలో 30,60,897 మంది జనాభా ఉన్నారు. ఇందులో 18,95,916 మంది ఓటర్లుగా నమోదయ్యారని సెప్టెంబరు 1న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా ద్వారా తెలుస్తోంది.   పాత జాబితాను పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు  కనిపిస్తున్నాయి. ఒకే వ్యక్తికి రెండు, మూడు, నాలుగుచోట్ల ఓట్లు ఉండడం...ఒకే ఐడీతో రెండుచోట్ల ఓట్లు..పేరు, ముఖం రెండూ ఒకటైనా..ఊర్లు వేర్వేరుగా చూపించారు. జిల్లాలో అలాంటి  ఓట్లు సుమారు వేలల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రజాప్రతినిధిని ఎన్నుకునే వ్యక్తికి సంబంధించి ఓటుహక్కు ఒకచోటే ఉండాలి. అది ఎక్కడైనా ఓటరు ఇష్ట్రపకారం ఉండవచ్చు.కానీ అలా కాకుండా రెండు, మూడు చోట్ల ఉండడం చూస్తే ఎలా జరిగిందన్నది అర్థం కావడం లేదు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటి దొంగ ఓట్లు కనిపిస్తున్నాయి.

టీడీపీ నేతల వ్యూహం
జిల్లాలో రాజకీయంగా బలంగా ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కొనేందుకు టీడీపీ నేతలు ఓట్ల రాజకీయానికి తెర తీశారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే గతంలోనూ కడపకు వచ్చిన ఆర్డీఓ విషయంలో కూడా నేతలుఓట్ల  మార్పులు, చేర్పుల విషయంలో ఒత్తిడి చేసినట్లు తెలిసింది.అంతేకాకుండా కిందిస్థాయి అధికారులపై కూడా పెద్ద ఎత్తున ఓట్లు వైఎస్సార్‌ సీపీకి చెందినవి చేరకుండా చూడాలని ఒత్తిడి చేసినట్లు తెలియవచ్చింది.  కనీసం తక్కువ తేడా వచ్చిన చోట ఈసారైనా పాగా వేయాలని టీడీపీ నేతలు కుయుక్తులు పడినట్లు వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  

ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి
ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు రెండు నుంచి మూడు లక్షల మేర ఓట్లు ఉన్నాయి. దొంగ ఓట్లతోపాటు ఇతర అనేక రకాల సమస్యలతో ఒకరికే రెండు, మూడు ఓట్లు  ఉన్నాయి.  మచ్చుకు కొన్నిమాత్రం బయటికి కనిపిస్తున్నా...లోలోపల ఎన్ని ఉన్నాయో అర్థం కావడం లేదు. వార్డువార్డు పరిశీలిస్తే పెద్ద ఎత్తున ఓట్ల గోల్‌మాల్‌ వ్యవహారం బయటికి వస్తుంది. గతంలో కూడా ఒక్క కడపలోనే పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతైన సంగతి  తెలిసిందే. అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే చాలా వరకు ఇలాంటి రెండు, మూడు చోట్ల ఉన్న ఓట్లను తొలగించేందుకు ప్రత్యేక నిబందనను తీసుకు వచ్చేలా కృషి చేయాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. ఎందుకంటే పది కేటగిరీల్లో బోగస్‌ ఓట్లు నమోదైనట్లు వాస్ట్‌ స్పష్టం చేసిన నేపధ్యంలో జిల్లా అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top