
హైదరాబాద్ : ప్రముఖ హీరోయిన్ల పేర్లు, ఫోటోలు ఉన్న నకిలీ ఓటరు కార్డులు వెంగళరావునగర్, యూసుఫ్‌గూడ, రహమత్‌నగర్ డివిజన్ల పరిధిల్లో వెలిశాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు తమ ఫోన్లలో వచ్చిన ఆయా కార్డులను చూసి విస్తుపోతున్నారు. ప్రముఖ హీరోయిన్లయిన రకుల్ ప్రీత్‌సింగ్, సమంత రూత్ ప్రభు, తమన్నా భాటియాలు వీరంతా ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నారు. వారు నిజంగా మా ప్రాంతాల్లో ఉన్నారా అంటూ ఆరా తీస్తున్నారు.
ఈ ఓటరు కార్డులు వైరల్ (Viral) కావడంతో అటుతిరిగి ఇటు తిరిగి అధికారుల దృష్టికి వెళ్ళింది. దాంతో వాటిని పరిశీలించిన ఎన్నికల అధికారులు ఆయా కార్డులు నకిలీవంటూ తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, సర్కిల్–19 ఉప కమిషనర్ రజినీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్డులు ముద్రించి ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రూ.78.85 లక్షలు సీజ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో భారీగా డబ్బులు తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్, ఫిలింనగర్, బోరబండ, మధురానగర్, పంజగుట్ట, సనత్‌నగర్, టోలిచౌకి, గోల్కోండ పోలీస్‌స్టేషన్ల పరిధిలో గత 5 రోజుల నుంచి వేర్వేరు చోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టి రూ.78.85 లక్షలు సీజ్ చేశారు.
రూ.10 లక్షలు..
వెంగళరావునగర్ : అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షల నగదును బుధవారం ఎన్నికల పర్యవేక్షణ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు స్వాదీనం చేసుకున్నాయి. అమీర్‌పేట చౌరస్తా, వెంకటగిరి కాలనీ రోడ్డు, మధురానగర్‌కాలనీతో పాటు తదితర ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో సరైన రసీదులు లేని డబ్బును స్వాదీనం చేసుకున్నారు.
రూ.21.21 లక్షలు విడుదల చేసిన జిల్లా గ్రీవెన్స్ కమిటీ
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల (Jubilee hills by poll) సందర్భంగా అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద స్వా«దీనం చేసుకున్న రూ.21.21 లక్షలను జిల్లా గ్రీవెన్స్ కమిటీ బుధవారం విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ కె.మంగతాయారు అధ్యక్షతన గల కమిటీ జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీస్‌లో విచారణలు నిర్వహించింది.

మొత్తం 5 కేసులకు సంబంధించి సాక్ష్యాధారాలు పరిశీలించింది. ఎన్నికలకు సంబంధం లేని నగదు అని రూఢీ చేసుకున్న తర్వాత స్వాదీనం చేసుకున్న రూ.21,21,600 నగదును విడుదల చేసింది. కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ వెంకటేశ్వర్ రెడ్డి, సభ్యులు వసుంధర, శరత్ చంద్ర పాల్గొన్నారు.