పట్టణ పేదల ఇళ్లలో ప్రజాధనం ఆదాకు ‘రివర్స్‌’

Expert Panel concludes that TDP Govt Irregularities in poor people housing construction - Sakshi

రాష్ట్రంలో చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్నిరూ.2,000కు కట్టబెట్టిన టీడీపీ సర్కార్‌

పక్క రాష్ట్రాల్లోనూ జీఎస్టీతో కలిపి చ.అడుగు నిర్మాణ వ్యయం రూ.1,500 – రూ.1,600 మాత్రమే

గత సర్కార్‌ ప్రజాధనాన్ని దోచిపెట్టిందని తేల్చిన నిపుణుల కమిటీ

రివర్స్‌ టెండరింగ్‌తో చదరపు అడుగుకు సుమారు రూ.500 చొప్పున ఆదా అవుతుందంటున్న నిపుణులు

రూ.వేల కోట్ల మేర ప్రజాధనం ఆదా అయ్యే అవకాశం

సాక్షి, అమరావతి: పట్టణ పేదల ఇళ్ల నిర్మాణ పనులకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పక్క రాష్ట్రాల్లో జీఎస్టీతో కలిపి పట్టణ పేదల ఇళ్ల నిర్మాణ పనులను చదరపు అడుగుకు రూ.1,500 నుంచి రూ.1,600 చొప్పున అప్పగిస్తే రాష్ట్రంలో మాత్రం చదరపు అడుగుకు రూ.2,000 చొప్పున గృహాల నిర్మాణ పనులను టీడీపీ సర్కార్‌ కట్టబెట్టింది. పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామనే సాకుతో గత సర్కార్‌ భారీ దోపిడీకి పాల్పడిందని నిపుణుల కమిటీ తేల్చింది. ఈ నేపథ్యంలో రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహిస్తే భారీ ఎత్తున ప్రజాధనం ఆదా అవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా చదరపు అడుగుకు రూ.500 చొప్పున ఆదా అయ్యే అవకాశం ఉందని.. దీనివల్ల పట్టణ పేదలకు భారీ ఎత్తున ఊరట లభిస్తుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ప్రజాధనం భారీగా ఆదా...
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పీఎంఏవై కింద ఐదు లక్షల ఇళ్లను మంజూరు చేసింది. రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహిస్తే.. 300 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఒక్కొక్క  ఇంటికి చదరపు అడుగుకు రూ.500 ప్రకారం రూ.1.50 లక్షల చొప్పున ఆదా అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే 365, 430 చ.అడుగుల విస్తీర్ణంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణంలో ఖజానాకు మరికొంత ఆదా అయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ లెక్కన రూ.వేల కోట్లకుపైగా ప్రజాధనం ఆదా అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. 

టెక్నాలజీ సాకు... ఉపకరణాల కొనుగోళ్లలో అక్రమాలు 
రాష్ట్రంలో టీడీపీ సర్కార్‌ పట్టణ పేదలకు 225 ప్రాంతాల్లో 4,54,909 గృహాలను నిర్మించి ఇచ్చే పనులను 34 ప్యాకేజీలుగా కింద విభజించి 2017 ఏప్రిల్‌లో ఈపీసీ(ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌) విధానంలో టెండర్లు పిలిచింది. పట్టణాల్లో పేదలకు సొంతింటిని చేకూర్చడం కోసం ఒక్కో ఇంటికి కేంద్రం పీఏంఏవై కింద రూ.1.50 లక్షలు ఇస్తే రాష్ట్రం రూ.1.50 లక్షలు ఇస్తుంది. అంటే ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.మూడు లక్షలు ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నిధులతో సాంప్రదాయ పద్ధతుల్లో ఇళ్లను నిర్మించే అవకాశం ఉంది. కానీ టీడీపీ సర్కార్‌ వ్యవహరించిన విధానాల వల్ల 300 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన ఇంటి వ్యయం రూ.5.72 లక్షలకు(లబ్ధిదారునిపై భారం రూ.2.72 లక్షలు), 365 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన ఇంటి వ్యయం రూ.6.74 లక్షలకు (లబ్ధిదారునిపై భారం రూ.3.74 లక్షలు), 430 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన ఇంటి వ్యయం రూ.7.71 లక్షలకు (లబ్ధిదారునిపై భారం రూ.4.71 లక్షలు) పెరిగింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ విచారించింది. షీర్‌ వాల్‌ టెక్నాలజీ, ఉపకరణాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడటం వల్ల ఇళ్ల నిర్మాణ పనుల వ్యయం రూ.25,170.99 కోట్లకు చేరుకుందని నిపుణుల కమిటీ నిర్థారిస్తూ ఈ ఏడాది  జూలై 17న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

హుద్‌హుద్‌ ఇళ్లలో మిగిలిన పనులకే టెండర్లు
విశాఖ జిల్లాలో హుద్‌హుద్‌ తుపాన్‌ బాధితుల కోసం 800 మిగిలిపోయిన ఇళ్ల పనుల కోసం రూ.8,53,50,387 వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. దీంతో యూనిట్‌ వ్యయం రూ.1,06,687 అవుతోందని, కొత్త పనులైతే యూనిట్‌ ధర ఎక్కువగా ఉండేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ‘సాక్షి’ ఆదివారం సంచికలో మిగిలిన పనులకు బదులుగా హుద్‌హుద్‌ ఇళ్లు కొత్త పనులుగా ప్రచురితమైంది. పాఠకులు ఈ మార్పును గమనించాల్సిందిగా కోరుతున్నాం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top