ఉనికి పాట్లు! | Existence, so! | Sakshi
Sakshi News home page

ఉనికి పాట్లు!

Oct 30 2014 1:42 AM | Updated on Sep 2 2017 3:34 PM

అనంతపురం కార్పొరేషన్ : అధికారంలో ఉన్నప్పుడు కానీ అంతకు ముందు తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ జిల్లాలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీకి...

అనంతపురం కార్పొరేషన్ : అధికారంలో ఉన్నప్పుడు కానీ అంతకు ముందు తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ జిల్లాలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆదరణ కరువైంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారు. మే నెలలో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీచేసిన 14 అసెంబ్లీ స్థానాల్లోనూ డిపాజిట్ దక్కలేదంటే ఆ పార్టీని ప్రజలు ఎంతగా ‘దూరం' పంపించారో అర్థమవుతోంది.

కేవలం ఒక్క ఏడాదిలోనే కాంగ్రెస్ పరిస్థితి తారుమారయ్యింది. రాష్ట్ర విభజనతో ఆ పార్టీకి ఈ దుస్థితి వచ్చింది. ఆ పార్టీపై ప్రజలు దుమెత్తిపోశారు. ప్రజల నాడిని పసిగట్టిన ప్రధాన నాయకులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్న జేసీ దివాకర్‌రెడ్డి తెలుగుదేశం గూటికి చేరారు. అనంతవెంకటరామిరెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు.

పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అనుచరునిగా ముద్ర వేసుకున్న ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తెలుగుదేశం గూటికి చేశారు. మరికొందరు నాయకులు తలా ఒక దారి చూసుకున్నారు. చివరికి ఆ పార్టీకి చెప్పుకోదగ్గ నాయకులుగా పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్ మాత్రమే మిగిలారు. అడపాదడపా వారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ‘ఉందండోచ్’ అని ప్రజలకు గుర్తు చేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నేడు (గురువారం) ఆ పార్టీ విస్త­ృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు.

ఆర్ట్ కళాశాల మైదానంలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లను బుధవారం ఆ పార్టీ నాయకులు పరిశీలించారు. సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ, కేంద్ర మాజీ మంత్రులు చిరంజీవి, జేడీశీలం, ఏఐసీసీ, పీసీసీ నాయకులు హజరవుతారని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ తెలిపారు.

గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ‘ఇందిరమ్మ మాట... కాంగ్రెస్ బాట’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. కార్యకర్తల్లో నూతనోత్సవం నింపడానికి ఈ సభ ఉపయోగపడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement