
ఎర్రబెల్లి, మోత్కుపల్లి ద్రోహులు: కడియం
తెలంగాణ టీడీపీ ఫోరం నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు ద్రోహులుగా మారారని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి విమర్శించారు.
వరంగల్: తెలంగాణ టీడీపీ ఫోరం నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు ద్రోహులుగా మారారని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి విమర్శించారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య ఒప్పందాలంటూ ఇష్టమొచ్చిన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హన్మకొండలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ బిల్లు ఆమోదంపై దృష్టి పెట్టకుండా టీడీపీ నాయకులు టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. సమన్యాయం పేరుతో చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక విలీనమా, పొత్తా, స్వతంత్రంగా పోటీ చేస్తుందా అనే అంశాలను టీఆర్‌ఎస్ నిర్ణయించుకుంటుందని, తమ పార్టీ రాజకీయ వ్యవహారాలు మీకెందుకంటూ నిలదీశారు.
కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం కావద్దని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆపార్టీ నాయకులు వద్దంటున్నా సిగ్గులేకుండా పొత్తులంటూ వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తులేకుంటే పుట్టగతులుండవనే ఈ ప్రయత్నమన్నారు. టీఆర్‌ఎస్‌కు ఆ అవసరంలేదని, ఎవరికైనా తమ పార్టీ అవసరమే ఉందని కడియం పేర్కొన్నారు.