
సాక్షి, విజయవాడ : బెజవాడ కనకదుర్గ చీర దొంగతనం ఆరోపణలతో ఆలయ పాలకమండలి సభ్యురాలు సూర్యలత సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఆయన చైర్మన్ గౌరంగబాబు సూర్యలతపై చర్యలు తీసుకున్నారు. చీర మాయం ఘటనపై ఆలయ ఈవో పద్మ నివేదిక సిద్ధం చేశారు. ఆలయ ట్రస్టు బోర్డులోని సభ్యురాలు సూర్యలత దుర్గమ్మ చీరను తీసినట్లు రిపోర్టులో స్పష్టం చేశారని తెలిసింది.
చీర మాయం విషయంపై ప్రభుత్వం కూడా సీరియస్ అయిన నేపథ్యంలో కదిలిన ఈవో నివేదికను రూపొందించారు. అయితే, నివేదికను ప్రభుత్వానికి పంపే ముందు ఈవో పద్మ వన్‌టౌన్ పోలీసులతో మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. సీసీ టీవీ ఫుటేజి లేకపోయినా ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం నమోదు చేసినట్లు ఈవోకు పోలీసులు తెలిపారు.
దీంతో వాంగ్మూల నమోదు ప్రతిని తనకు ఇవ్వాలని ఈవో పద్మ పోలీసులను కోరారు. చీర తీసిన పాలకమండలి సభ్యురాలిపై కేసు నమోదు అయితే ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుంది కనుక కేవలం చర్యలు మాత్రమే తీసుకోవాలని ఈవో నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
నాది తప్పు ఎలా అవుతుంది : సూర్యలత
చీర వివాదంపై ఆలయ పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత మాట్లాడారు. ఆలయ చైర్మన్, ఈఓలు భక్తుల నుంచి సన్మానాలు స్వీకరిస్తే తప్పు కానిది, తాను భక్తులు సన్మానించిన చీరను తీసుకుంటే తప్పు ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. చైర్మన్ నుంచి తనకు ఇంకా సస్పెన్షన్ ఆర్డర్ రాలేదని చెప్పారు.
ఆలయంలోని కొందరు కుట్రపూరితంగానే ఇలా చేశారని అన్నారు. ఆలయ అర్చకుడు శాండిల్య చేసిన ఆరోపణలతో తనను ఎలా సస్పెండ్ చేస్తారని నిలదీశారు. భక్తుల నుండి నేను చీరలు ప్రసాదంగా తీసుకున్నానని చైర్మన్ అనడం సరికాదని చెప్పారు. పాలకమండలిలో తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు.