స్థానిక మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారంలో గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం కోసం టీఎంఎస్, సీఐటీయూలు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి.
జహీరాబాద్, న్యూస్‌లైన్:
స్థానిక మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారంలో గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం కోసం టీఎంఎస్, సీఐటీయూలు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. ఈనెల 28న ఎన్నికలు జరగనుండడంతో ఈ రెండు యూనియన్ల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా ఆయా యూనియన్ల నేతలు కర్మాగారం ప్రధాన గేటు వద్ద, కార్మికుల క్వార్టర్ల వద్ద పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. టీఎంఎస్ తరఫున టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు, సీఐటీయూ తరఫున సీపీఎం జిల్లా కార్యదర్శి చుక్కా రాములు తలపడుతున్నారు.
హరీష్‌రావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఆయన మూడు పర్యాయాలు కార్మికులతో సమావేశాలు నిర్వహించారు. గత మూడు పర్యాయాలు కర్మాగారంలో సీఐటీయూ అధికారంలో ఉంటూ వచ్చినా కార్మికులను ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని హరీష్‌రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. అధికార యూనియన్ తప్పిదాలను తన విజయానికి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికార యూని యన్ అయిన సీఐటీయూ వ్యవస్థాపక సభ్యుడు రఘుప్రసాద్, ఉపాధ్యక్షుడు వినోద్, నాయకులు ఉమా మహేశ్వర్‌రావు, సుభాకర్‌తోపాటు పలువురు తెలంగాణ మజ్దూర్ సంఘ్‌లో చేరి హరీష్‌రావు విజయం కోసం పని చేస్తున్నారు. హెచ్‌ఎంఎస్, బీఎంఎస్ యూని యన్లు సైతం హరీష్‌రావుకు మద్దతు ప్రకటించాయి. అధికార యూనియన్ నేతలు తమ స్వార్థం కోసం కార్మికులు, కాంట్రాక్టు కార్మికుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో నిధులను వసూలు చేస్తూ వారికి అన్యాయం చేస్తున్నారని టీఎం ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.
తమ యూనియన్‌ను గెలిపిస్తే కార్మికులకు మేలు జరిగేలా నడుచుకుంటామని టీఎంఎస్ నాయకులు భరోసా ఇస్తున్నా రు. వారు ప్రతి కార్మికుడిని నేరుగా కలిసి హరీష్‌రావును గెలిపించాలని కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ జహీరాబాద్‌లోనే మకాం వేసి యూనియన్ గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నందున టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని, హరీష్‌రావును గెలిపించడం ద్వారా కార్మికులకు మేలు జరుగుతుందని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు.
నాలుగోసారి కోసం సీఐటీయూ వ్యూహం..
ఇదిలావుంటే ప్రత్యర్థిని విజయానికి ఏ మాత్రం చేరువలోకి తీసుకురావద్దనే వ్యూహంతో అధికార సీఐటీయూ ముం దుకు సాగుతోంది. హంగు ఆర్బాటాలు లేకుండా చాపకింద నీరులా ప్రచారం నిర్వహిస్తోంది. తమ యూనియన్‌పై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని, కార్మికులకు తమ యూనియన్ వల్లే న్యాయం జరుగుతుందని సీఐటీ యూ మద్దతుదారులు ప్రచారం చేస్తున్నారు. కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఉన్న చుక్కా రాములు ఇప్పటికే ఒక మా రు కార్మికులతో సమావేశం నిర్వహిం చారు. మరోమారు సమావేశం నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మహీంద్రాలో నాలుగోసారి కూడా విజ య కేతనం ఎగురవేస్తామని సీఐటీయూ మద్దతుదారులు ధీమాతో ఉన్నారు. ఇదిలావుంటే కార్మికులు ఎవరిని ఆదరి స్తారో మరో రెండురోజుల్లో తేలనుంది.