పసినోళ్లకు పోషకాహారం దూరం

Eggs Supply Stops Anganwadi Centres - Sakshi

2 లక్షల మందికి పైగా చిన్నారులకు అందని కోడిగుడ్లు

70 వేల మందికి పైగా గర్భవతులు, బాలింతలకు కూడా..

అంగన్‌వాడీలకు నిలిచిన సరఫరా

జిల్లాలో సరఫరాదారులకు రూ.13 కోట్ల  బకాయిలు

కొత్త ఒప్పందానికి కొరవడ్డ ఆమోదం

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు. అందరూ ఆరోగ్యభాగ్యవంతులైతేనే సమాజం అన్నివిధాలుగా వికాసం చెందుతుందనేది అక్షర సత్యం. ఈ భావనతోనే ప్రభుత్వం అంగన్‌వాడీ చిన్నారులు, బాలింతలు, గర్భవతులు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కోడిగుడ్లను సరఫరా చేస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్లను అనపర్తి ప్రాంతీయ కోళ్ల రైతుల సంక్షేమ సంఘం పేరిట రైతులు  సరఫరా చేస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా సరఫరా చేసిన గుడ్లకు డబ్బులు చెల్లించక పోవడంతో పాటు గుడ్డు ఒక్కింటికి చెల్లించే ధరపై మధ్య ఒప్పందం ఖరారు కాకపోవడంతో రైతులు సరఫరాను నిలిపివేశారు. దీంతో ప్రభుత్వ సంకల్పం నెరవేరడం లేదు.

తూర్పుగోదావరి, రాయవరం (మండపేట): జిల్లాలో 28 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 5,545 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 431 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల పరిధిలో గర్భవతులు 34,953 మంది ఉండగా వారిలో 34,942 మంది, పాలిచ్చే తల్లులు 36,280 మంది ఉండగా వారిలో 36,131 మంది పౌష్టికాహారాన్ని తీసుకుంటున్నారు. అలాగే 0–1 వయసున్న చిన్నారులు 35,742 మంది ఉండగా వారిలో 35,571 మంది, 1–3 వయసున్న చిన్నారులు 1,19,626 మంది ఉండగా మొత్తం అందరూ, 3–6 చిన్నారులు 1,20,925 మంది ఉండగా వారిలో 83,277 మంది పౌష్టికాహారం తీసుకుంటున్నారు. వీరందరికీ ప్రతి రోజూ ఉడికించిన కోడిగుడ్డు సరఫరా చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రూ.93 కోట్ల బకాయిలు
కోడిగుడ్లు సరఫరా చేస్తున్న రైతులకు గత కొన్ని నెలలుగా  ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ.93 కోట్లు ఉండగా, జిల్లాలో రూ.13 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. గతంలో సంస్థకు ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 40–50 గ్రాముల కోడిగుడ్డు ఒక్కింటికి రూ.4.68 పైసల వంతున చెల్లిస్తున్నారు. నెలకు 75 లక్షల కోడిగుడ్లను కోళ్ల రైతులు అనపర్తి ప్రాంతీయ కోళ్ల రైతుల సంక్షేమ సంఘం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు.  గతేడాదితో పోలిస్తే 40 శాతం వరకు పెరిగిన దాణా ధరల నేపథ్యంలో గుడ్డు ధరను పెంచాలని సరఫరాదారులు డిమాండ్‌ చేస్తున్నారు. పాత టెండర్‌ ముగియడంతో ఇటీవల కోడిగుడ్ల సరఫరాకు కొత్తగా టెండర్లు పిలిచారు. 45–55 గ్రాముల బరువున్న కోడిగుడ్డు రూ.5.16 పైసలకు సరఫరా చేసేందుకు గతంలో సరఫరా చేసిన సంస్థే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ నుంచి ఆమోద ముద్ర పడక పోవడంతో పాటు పాత బకాయిలు చెల్లించక పోవడంతో గుడ్ల సరఫరాను పది రోజులుగా నిలిపి వేసినట్లు సరఫరాదారులు చెబుతున్నారు. పది రోజుల క్రితం సరఫరా చేసిన కోడిగుడ్లు కొన్ని రోజులు వచ్చినా ఇప్పుడు సరఫరా నిలిపి వేయడంతో లబ్ధిదారులకు పౌష్టికాహారం కరువైంది. 

తలలు పట్టుకుంటున్న అధికారులు
జనవరి 2 నుంచి ప్రారంభం కానున్నజన్మభూమి గ్రామసభల్లో కోడిగుడ్లు సరఫరా కాకపోవడంపై ప్రజల నుంచి విమర్శలు ఎదురైతే ఏమి సమాధానం చెప్పాలని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారులు, సూపర్‌వైజర్లు ఆందోళన చెందుతున్నారు. అయితే జన్మభూమి ప్రారంభమయ్యేలోగా సమస్య పరిష్కారమవుతుందన్న ఆశాభావంతో ఉన్నారు.

గిట్టుబాటు కావడం లేదు
కోళ్ల దాణా ధరలు 30–40 శాతం వరకు పెరిగాయి. కోడిగుడ్డు బరువును 45–55 గ్రాములకు పెంచారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే రూ.4.68 పైసల ధర గిట్టుబాటు కావడం లేదు. అందుకే  గుడ్ల సరఫరాకు కోళ్ల రైతులు విముఖత చూపుతున్నారు. ప్రభుత్వం మా పరిస్థితిని కూడా గమనించాలి.– పడాల సుబ్బారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్‌

కొత్త టెండర్లు ఖరారు చేస్తాం
వచ్చే నెల నాలుగున కొత్త టెండర్లు ఖరారు చేస్తాం. ఆ వెంటనే కోడిగుడ్ల సరఫరాకు చర్యలు తీసుకుంటాం. ఈలోగా కోడిగుడ్లు అంగన్‌వాడీ కేంద్రాలకు అందేలా అన్ని చర్యలూ చేపడతాం. గత సరఫరా దారులు వచ్చే నెల 15 వరకు సరఫరా చేయాల్సి ఉంది.–పి.సుఖజీవన్‌బాబు,ప్రాజెక్టు డైరెక్టరు, ఐసీడీఎస్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top