భయపెట్టిన భూకంపం

రిక్టర్‌ స్కేలుపై 2.6గా నమోదు

ఎలాంటి ప్రమాదమూ లేదన్న నిపుణులు

యూనివర్సిటీ క్యాంపస్‌/యాదమరి: జిల్లాలోని తమిళనాడు సరిహద్దు మండలాల్లో శనివారం అర్ధరాత్రి భూకంపం కలకలం సృష్టించింది. యాదమరి మండలంలోని తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో పలుమార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు. రెవెన్యూ సిబ్బంది ఆయా గ్రామాలను సందర్శించి సమాచారం సేకరించారు. ఈ వివరాలను హైదరాబాద్‌లోని నేషనల్‌ జియోగ్రాఫికల్‌ ఇన్‌స్టిట్యూట్‌కు సమాచారం అందించారు. చిత్తూరుకు 30 కిమీ దూరంలో అర్ధరాత్రి 01.02 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయని, వీటి తీవ్రత 2.6గా నమోదైనట్లు వారు గుర్తించారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని, చిత్తూరు జిల్లా ప్రమాదకర జోన్‌లో లేదని సేఫ్‌ జోన్‌లోనే ఉందని అన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎస్వీయూకు చెందిన ప్రొఫెసర్లు తెలిపారు.

మళ్లీ ప్రకంపనలు..
యాదమరి మండలం తాళ్లమడుగులో ఆదివారం రాత్రి 7–8గంటల మధ్య నాలుగు పర్యాయాలు కంపించింది. భూమి కదలడం, పెద్ద శబ్దాలు రావడంతో గ్రామస్తులు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top