మే 8న నిర్వహించనున్న ఎంసెట్-2015 పరీక్షకు ఈ నెల 6 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కన్వీనర్ సీహెచ్. సాయిబాబు బుధవారం తెలిపారు.
చివరి తేది ఏప్రిల్ 11 మే 8న పరీక్ష, 26న ఫలితాలు
కాకినాడ: మే 8న నిర్వహించనున్న ఎంసెట్-2015 పరీక్షకు ఈ నెల 6 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కన్వీనర్ సీహెచ్. సాయిబాబు బుధవారం తెలిపారు. దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్ 11. రూ. 500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 16 వరకు, రూ. వెయ్యి అపరాధ రుసుంతో ఏప్రిల్ 22వరకు, రూ. ఐదువేల అపరాధ రుసుంతో మే 2 వరకు, రూ.పదివేల అపరాధ రుసుంతో మే 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. దరఖాస్తులో మార్పులు చేర్పులు ఏప్రిల్ 16 నుంచి 21 వరకు చేసుకోవచ్చన్నారు. ఒక విద్యార్థి ఒకసారి మాత్రమే దరఖాస్తు చేయాలని చెప్పారు. దరఖాస్తు ఫీజు రూ. 250 ఏపీ ఆన్‌లైన్, టీఎస్ ఆన్‌లైన్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లలో క్రెడిట్, డెబిట్, మ్యాస్ట్రో కార్డుల ద్వారా చెల్లించవచ్చని తెలిపారు.
ఇంజనీరింగ్, మెడిసిన్ రెండు పరీక్షలకు దరఖాస్తు చేసేవారు రూ. 500 ఫీజు చెల్లించాలని చెప్పా రు. ప్రస్తుతం ఉన్న 17 రీజనల్ కేంద్రాలతోపాటు ఈ ఏడాది కొత్తగా విశాఖ జిల్లా అనకాపల్లి, గుంటూరు జిల్లా నరసారావుపేట, కర్నూలు జిల్లా నంద్యాల, వైఎస్పార్ కడప జిల్లా ప్రొద్దుటూరుల్లో సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మే 2 నుంచి 6 వరకు హాల్ టిక్కెట్లను ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. ఎపీఎంసెట్.ఒఆర్‌జి’ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. మే 8న ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 గంటలకు, అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష మధ్యాహ్నం 2.30కు నిర్వహిస్తామన్నారు. ఫలితాలు మే 26న విడుదల చేయనున్నట్టు చెప్పారు. సందేహాల నివృత్తికి 0884-2340535లో సంప్రదించాలన్నారు.