అధికారుల నిర్లక్ష్యం కారణంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఖజానాకు సుమారు రూ.42 లక్షలు నష్టం
హైకోర్టులో దేవస్థానానికి చుక్కెదురు
సరిగా స్పందించని అధికారులు
గత చీరల కాంట్రాక్టు డిపాజిట్ చెల్లించమని ఆదేశాలు
పాడైపోయిన చీరలన్నీ దేవస్థానం ఖాతాలోకి
విజయవాడ : అధికారుల నిర్లక్ష్యం కారణంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఖజానాకు సుమారు రూ.42 లక్షలు నష్టం వాటిల్లింది. హైకోర్టులో ఉన్న కేసుల విషయంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చివరికి హైకోర్టు కాంట్రాక్టర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో కాంట్రాక్టర్ దేవస్థానానికి చెల్లించిన డిపాజిట్లను, అతను చెల్లించిన అద్దెను తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్లితే... 2013, నవంబర్‌లో అమ్మవారి చీరలు, రవికలు సేకరించుకునే కాంట్రాక్టుకు టెండర్లు పిలిచారు. బోస్ అండ్ బోస్ సంస్థ ప్రతినిధి పి. ఝాన్సీరాణి టెండర్‌ను దక్కించుకుని ఆరు నెలల అడ్వాన్సు చెల్లించారు. దేవస్థానం అధికారులు బోస్ అండ్ బోస్‌కు తక్కువ రేటుకు టెండర్‌ను ఇచ్చారని భావించిన దేవాదాయశాఖ కమిషనర్ 2014 ఏప్రిల్‌లో టెండర్‌ను రద్దుచే స్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టెండర్ రద్దు ఉత్తర్వులపై కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించారు. ఆ సంస్థ వద్ద అప్పటికి ఉన్న సరుకును విక్రయించుకునే వరకు దేవస్థానంలో స్థలం ఇవ్వాలని హైకోర్టు ఏప్రిల్ 23న ఉత్తర్వులు ఇచ్చింది. ఏప్రిల్ 23 నుంచి భక్తులు సమర్పించే చీరలు, రవికెలు దేవస్థానం వద్ద భద్రపరచాలని కోర్టు సూచించింది. చివరకు నవంబర్‌లో కాంట్రాక్టర్ కాల పరిమితి ముగియడంతో తిరిగి వేలం నిర్వహించి కొత్త కాంట్రాక్టర్‌కు ఇచ్చారు.
డిపాజిట్ కోసం తిరిగి కోర్టుకు
2014 మే నుంచి నవంబర్ వరకు సుమారు రూ. 90లక్షల విలువైన చీరలు అమ్మవారి గోదాముల్లో అధికారులు ఉంచారు. కాగా బోస్‌అండ్ బోస్ కాంట్రాక్టు ముగిసిన తరువాత ఈఎండీగా చెల్లించిన రూ.30లక్షలు, తన కాంట్రాక్టును ఏప్రిల్‌లో రద్దు చేసినందున తాను అడ్వాన్సుగా చెల్లించిన అద్దె సొమ్ములో మిగిలిన రూ.19.97 లక్షలు తిరిగి చెల్లించాలని ఈవోను కోరారు. దీనిపై దేవాదాయశాఖ కమిషనర్ వివరణ కోరగా.. దేవస్థానం సేకరించిన రూ.90లక్షలు చీరలను కాంట్రాక్టర్‌కే ఇచ్చి అతను చెల్లించిన ఈఎండీని, అడ్వాన్స్‌ను దేవస్థానం ఖాతాకు జమ చేయాలంటూ కమిషనర్ సూచించారు. దీనిపై కాంట్రాక్టర్ కోర్టుకు ఆశ్రయించారు.
చీరలు మాయం
దేవస్థానం గోదాములో కాంట్రాక్టర్ సరుకు భద్రపరుచుకోవడంతో.. దేవస్థానం సేకరించిన చీరలను సమాచార కేంద్రంలోనూ, ఖాళీగా ఉన్న గదుల్లోనూ భద్రపరిచారు. దీనితో ఎవరికి దొరికిన చీరలు వారు కాజేశారు. కాగా భక్తులు అమ్మవారికి సమర్పించిన 300 పట్టుచీరలను మార్చివేసి వాటి స్థానంలో కాటన్ చీరలు పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి ఘటనలే జరిగి ఉంటే చీరల విక్రయం ద్వారా వచ్చే నష్టం అరకోటి దాటే అవకాశం ఉంది.
స్పందించని అధికారులు
కోర్టునుంచి వచ్చిన ఉత్తర్వులపై గతంలో ఇన్‌చార్జి ఈవోగా పనిచేసిన వి.త్రినాథరావు, అప్పటి కిందిస్థాయి అధికారులు సరిగా స్పందించలేదు. దీంతో కాంట్రాక్టర్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. కాంట్రాక్టర్ కోరిన విధంగా అతని ఈఎండీ, అడ్వాన్స్‌లో మిగిలిన సొమ్మును తిరిగి చెల్లించమంటూ ఆదేశాలు జారీ చేసింది. దేవస్థానం వద్ద ఉన్న చీరలను దేవస్థానమే అమ్ముకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు దేవస్థానం వద్ద ఉన్న చీరలను అధికారులు నిర్ణయించిన ధరకు విక్రయించినా దేవస్థానానికి కనీసం రూ.42 లక్షలు నష్టం వస్తుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. అయితే గత నవంబర్ నుంచి గోదాముల్లో ఈ చీరలు మూలుగుతూ ఉండటం వల్ల కొంత డ్యామేజ్ అయి ఉండవచ్చు. అందువల్ల వీటిని తగ్గించి అమ్మితే ఈ నష్టం మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.