సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిలో వరుస వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. దుర్గమ్మ ఆలయ ప్రతిష్ట దెబ్బతింటున్నా అధికారులు, ప్రభుత్వం చోద్యం చేస్తోంది. కనకదుర్గానగర్ పార్కింగ్ వద్ద భక్తులపై దాడి ఘటన కలకలం రేపింది. విచక్షణ కోల్పోయి భక్తులపై పార్కింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. పార్కింగ్ విషయంలో ప్రశ్నించినందుకు భక్తులపై దాడి చేశారు.
భక్తులపై దాడి చేస్తున్నా సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోలేదు. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో దాడి దృశ్యాలు వైరల్‌గా మారాయి. అయితే, ఇప్పటి వరకూ తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఘటనపై స్పష్టత లేదంటూ దుర్గగుడి అధికారులు ప్రకటించారు. దుర్గగుడి అధికారుల బాధ్యతా రాహిత్యంపై భక్తులు మండిపడుతున్నారు.
కాగా, ఇటీవల దుర్గమ్మ సన్నిధిలో జరిగే శ్రీ చక్ర నవావరణార్చన పూజకు వినియోగించే పాలలో పురుగులు కనిపించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అమ్మవారి సన్నిధిలోని నూతన పూజా మండపంలో ఈ ఘటన చోటుచేసుకోగా వెలుగులోకి వచ్చింది. సంఘటన జరిగిన రోజు పూజను అర్ధగంట పాటు నిలిపివేశారు. ప్రత్యామ్నాయ పాల కోసం ఆలయ అర్చకులు దేవస్థాన వాట్సాప్ గ్రూప్‌లో సందేశాన్ని పెట్టడంతో విషయం బయకొచ్చి దావానంలా వ్యాపించింది.


