డీఎస్సీ గోల | DSC | Sakshi
Sakshi News home page

డీఎస్సీ గోల

Dec 13 2014 2:43 AM | Updated on Sep 2 2017 6:04 PM

జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు నిర్వహించనున్న టీచర్ ఎలిజిబిలిటీ అండ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ కం డీఎస్సీకి విధించిన నిబంధనలే నిరుద్యోగుల పాలిట ప్రతిబంధకాలుగా మారుతున్నాయి.

కర్నూలు(విద్య) : జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు నిర్వహించనున్న టీచర్ ఎలిజిబిలిటీ అండ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ కం డీఎస్సీకి విధించిన నిబంధనలే నిరుద్యోగుల పాలిట ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. దీంతో వందలాది మంది విద్యార్థులు డీఎస్సీకి అర్హతను కోల్పోయే అవకాశం ఉంది. రెగ్యులర్ డిగ్రీ, బీఈడీ కోర్సులు పూర్తి అయినా కూడా ఆయా యూనివర్శిటీల కాన్వకేషన్ సర్టిఫికెట్ల కోసం నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో రెండు, మూడేళ్ల నుంచి కోర్సు పూర్తి అయిన వారు కాన్వకేషన్ తీసుకోలేదు.
 
 ఆన్‌లైన్‌లో డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అనంతరం అభ్యర్థి ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు కాన్వకేషన్ తప్పక ఉండాలనే నిబంధన విధించడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గతంలో పరీక్ష నిర్వహించి, ఫలితాలు ప్రకటించిన అనంతరం ఎంపికైన అభ్యర్థుల విద్యార్హత, తదితర ధృవీకరణ పత్రాలను పరిశీలించేవారు. అయితే ఈ ఏడాది పరీక్షకు ముందు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తుండటం చాలా మంది అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారింది. అదే విధంగా గత ప్రభుత్వం నిర్వహించిన టెట్ ఫలితాలు వచ్చినా కూడా నేటికీ 80 శాతం మందికి మార్కుల జాబితాలు రాలేదు. చివరకు ఆ మార్కుల జాబితాలను నెట్‌లో తీసుకునేందుకు ప్రయత్నించినా అందుబాటులో లేకపోవడం గమనార్హం.  దూరవిద్య ద్వారా డిగ్రీ చేసిన వారికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఇబ్బందిగా మారుతోంది.
 
  ఇందుకు కారణం ఆన్‌లైన్‌లో టెన్త్, ఇంటర్, డిగ్రీ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. వీరు ఇంటర్మీడియట్ లేకుండానే డిగ్రీ చదివి ఉంటారు. ఇంటర్మీడియట్  వివరాలు నమోదు చేయకపోవడంతో ఆన్‌లైన్‌లో దూర విద్య ద్వారా చదివినవారి దరఖాస్తులు నమోదు కాక అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో దూర విద్యలో చదివినవారు యూనివర్శిటీలో చదివి ఉంటే ఆ యూనివర్శిటీకి యూజీసీ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కల్గిన జాయింట్ కమిటీ ఇచ్చిన గుర్తింపు పత్రాన్ని జత చేయాలనే నిబంధనను పెట్టారు. ఏ యూనివర్శిటీ కూడా విద్యార్థులకు ఈ గుర్తింపు పత్రం ఇవ్వరని, దీంతో పాటు దూర విద్య స్టడీ సెంటర్ అనుమతి పత్రం కూడా విద్యార్థులకు ఇవ్వరని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల డీఎడ్ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసిన వారి ఫలితాలు ప్రకటించారు. వీరు డీఎస్సీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలన్నా వెరిఫికేషన్ కోసం ఖచ్చితంగా మార్కుల జాబితా సమర్పించడం కొంత  ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా కొంత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అధికారులు అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement