నిధులుండీ కక్కుర్తి..! | Sakshi
Sakshi News home page

నిధులుండీ కక్కుర్తి..!

Published Mon, Jul 31 2017 1:31 AM

నిధులుండీ కక్కుర్తి..! - Sakshi

విజయనగరం పట్టణంలో తీరని దాహార్తి
ఏపీఎండీపీ, అమత్‌ పథకాల కింద రూ.73 కోట్లు కేటాయించిన కేంద్రం
రెండు పథకాల పూర్తయితే 14 వేలకు పైగా నూతన కుళాయిల
మంజూరుకు అవకాశం
మూడున్నరేళ్లుగా నత్తనడకన సాగుతున్న పనులు


 ప్రాంతం : విజయనగరం
హోదా : జిల్లా కేంద్రం, సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ
మొత్తం వార్డులు: 40
2011 అధికారిక లెక్కల ప్రకారం
 జనాభా :2.44 లక్షలు
ప్రస్థుతం నివసిస్తున్న జనాభా : సుమారు 4 లక్షలు
మంచి నీరు అందించే పథకాలు :3
పట్టణ ప్రజలకు  అవసరమైన నీరు:36 ఎంఎల్‌డీ
మూడు పథకాల నుంచి
లభ్యమవుతోన్న నీరు :17 ఎంఎల్‌డీ
ప్రస్తుతం ఉన్న కొరత :19 ఎంఎల్‌డీ
ప్రతి రోజు వ్యక్తికి ఇవ్వాల్సిన నీరు :140 ఎల్‌పీసీడీ
ప్రస్తుతం ఇస్తున్న నీరు : 70 ఎల్‌పీసీడీ
వ్యక్తిగత కుళాయిలు :19,880
పబ్లిక్‌ కుళాయిలు: 458
మీటరు కుళాయిలు :434
చేతిపంపులు : 1080


విజయనగరం మున్సిపాలిటీ: త్వరలో కార్పొరేషన్‌ హోదా దక్కించుకోనున్న విజయనగరం సెలక్షన్‌ గేడ్ర్‌ మున్సిపాలిటీలో తాగునీటి సమస్యకు మోక్షం లభించడం లేదు. ఇక్కడి ప్రజలను ఏళ్ల తరబడి వేధిస్తున్న తాగు నీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తున్నా ప్రయోజనం లేకపోతుంది. పనుల ప్రగతిపై అధికారులు, మున్సిపల్‌ పాలకవర్గం దృష్టి్ట సారించకపోవటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.  విజయనగరం పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏపీఎండీపీ, అమత్‌ పథకాల కింద మొత్తంగా రూ.73 కోట్లు మంజూరు చేసింది.

ఈ మొత్తంతో పట్టణ ప్రజలకు నిరంతరాయంగా పూర్తి స్థాయిలో నీటిని అందించాలన్నది ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే ఏపీఎండీపీ పథకం పనులు పూర్తయితే  పేద ప్రజలకు రూ.200కే 7 వేల నూతన కుళాయిలు, అమత్‌ పథకం పనులు పూర్తయితే మరో 7,414 కుళాయి కనెక్షన్‌లు మంజూరు చేయాలని నిర్ణయించారు. అయితే రెండు పథకాలు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా పనుల్లో ప్రగతి లేకపోవడంతో పట్టణంలో దాహం కేకలు తప్పడం లేదు. మరోవైపు కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేయాల్సిన పాలకులు, అధికారులు నివేదికల్లో నూతన కుళాయిలు మంజూరు సంఖ్య చూపించుకునేందుకు కసరత్తు చేయడం విమర్శలకు తావిస్తోంది.

దశాబ్దం క్రితం అనధికారికంగా ఏర్పాటైన కుళాయి కనెక్షన్లను రెగ్యులరైజ్‌ చేసి వాటిని ఈ పథకాల కింద మంజూరు చేశామని చూపించుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. కేవలం కాగితాల్లో లెక్కలు చూపించుకునేందుకు పడుతున్న తాపత్రయం  ప్రజా సమస్యల పరిష్కారంలో చూపించడం లేదన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. నిధులుండీ కక్కుర్తి బుద్ధి చూపించుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నత్తేనయం..
దశాబ్దాల క్రితం వేసిన పైప్‌లైన్‌లు మార్పు చేయడంతో పాటు కొత్త ప్రాంతాల్లో పైప్‌లైన్‌ల ఏర్పాటు, రక్షిత మంచి నీటి పథకాల వద్ద నూతన మోటార్లు బిగించటం, జనరేటర్, ట్రాన్స్‌ఫార్మర్ల సౌకర్యం కల్పించడం, కొత్తగా వాటర్‌ ట్యాంక్‌లు నిర్మించడం తదితర కార్యక్రమాల కోసం 2014లో ప్రభుత్వం ఏపీఎండీపీ పథకంలో రెండు ప్యాకేజీల కింద రూ.48 కోట్ల నిధులు మంజూరు చేసింది. కేటాయించిన నిధులతో ఏడాదిలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే ఇందులో ప్యాకేజీ–1 కింద  చేపట్టాల్సిన పనులు పూర్తికాగా, ప్యాకేజీ–2లో చేపడుతున్న పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఈ ప్యాకేజీలో మొత్తం 313 కిలోమీటర్ల పైప్‌లైన్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది. మూడేళ్లలో 236 కీ.మీ మేర పూర్తి చేయగలిగారు. పూల్‌బాగ్‌కాలనీ శివారుల్లో ఉన్న వ్యాసనారాయణమెట్ట ప్రాంతంలో రూ.96 లక్షల వ్యయంతో 5 లక్షల లీటర్ల నీటి సామర్ధ్యంతో నిర్మిస్తున్న వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పూల్‌బాగ్‌లో నిర్మించతలపెట్టిన మరో రిజర్వాయర్‌ నిర్మాణం ఇప్పటికీ పునాదుల దశలోనే  ఉంది.

అమత్‌ పథకంలో రూ.25 కోట్లు కేటాయింపులు..  
విజయనగరం పట్టణ వాసుల దాహార్తిని తీర్చేందుకు అమత్‌ పథకం కింద 2015–16, 2016–17 సంవత్సరాలకు సంబంధించి రూ.25 కోట్లు కేటాయించారు. ఈ ని«ధులతో రామతీర్థం, నెల్లిమర్ల రక్షిత మంచి నీటి పథకాల వద్ద తాగు నీటి వనరులు అభివద్ధి చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ రెండు పథకాల నుంచి 6 ఎంఎల్‌డీ నీరు వస్తుండగా, అమత్‌ పనులు పూర్తయితే 16 ఎంఎల్‌డీ నీరు పంపింగ్‌ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి.

 అనధికారిక కుళాయిలను గుర్తిస్తున్నాం..
గతంలో మున్సిపాలిటీలో చాలా వరకు అనధికారిక కుళాయిలు ఏర్పాటు చేసుకున్నారు. వాటిని గుర్తించే పని మొదలుపెట్టాం. ఏపీఎండీపీ, అమత్‌ పథకాల కింద రెగ్యులరైజ్‌ చేస్తాం. ఈ రెండు పథకాల పనులు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. సాంకేతిక ఇబ్బందులు అదిగమించాల్సి ఉంది.            
– గణపతిరావు, ఇన్‌చార్జి ఎంఈ, విజయనగరం మున్సిపాలిటీ.

Advertisement
Advertisement