మూగబోయిన విప్లవ గళం

Dr. Krishnamurthy Who Struggled To Develop Rayalaseema Passed Away - Sakshi

సీమ అభివృద్ధి కోసం పరితపించిన కృష్ణమూర్తి కన్నుమూత  

సాక్షి, అనంతపురం కల్చరల్‌/శింగనమల: ‘పాలక పక్షాలన్నీ సీమకు అన్యాయమే చేశాయి.. దోపిడీ విధానాలతో తీరని మోసం చేస్తున్నాయి’ అంటూ సీమలోని పలు వేదికలపై నినదించిన విప్లవ గళం డాక్టర్‌ కృష్ణమూర్తి ఇక లేరు. రాయలసీమ అభ్యున్నతి కోసం జీవితాంతం పరితపించిన ఆయన ఇటీవల రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతూ పదిరోజుల కిందట తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. కక్షలు... కార్పణ్యాలు మాత్రమే రాయలసీమ ముఖచిత్రం కాదని, కరువు కరాళ నృత్యం చేస్తున్నా కళలకు, విజ్ఞానదాయక విషయాలకు నెలవని చాటుతూ సీమ ఊపిరిగా జీవించిన ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. శాస్త్రీయమైన నిబద్ధతతో ఉద్యమ ఊపిరులందించిన ఆయన అంత్యక్రియలు సోమవారం అనంతపురం శివారులోని బళ్లారి రోడ్డులో నిర్వహించారు. అంతకు ముందు అనంతపురంలోని కల్యాణదుర్గం రోడ్డులోని వైట్‌ఫీల్డ్‌ క్వార్టర్స్‌ వద్ద ఆయన భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్ధం ఉంచారు. పలు జిల్లాల నుంచి అభిమానులు, ఉద్యమకారులు విచ్చేసి కన్నీటి నివాళులర్పించారు.  

విద్యావంతుల వేదిక ఏర్పాటుతో..  
జిల్లాలోని నార్పల మండలం చామలూరు గ్రామంలో వెంకటలక్ష్మమ్మ, ఎరికలప్ప దంపతులకు 1961 జూన్‌ 6న  కృష్ణమూర్తి జన్మించారు. కర్నూలు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్,  స్త్రీల వ్యాధులపై డీజీవో కోర్సు పూర్తి చేశారు. విద్యార్ధి దశలోనే రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అదే జిల్లాలో వివిధ ప్రాంతాలలో ప్రభుత్వ వైద్యునిగా సేవలందించారు. ఏపీ పౌరహక్కుల సంఘం సభ్యునిగా అనేక ప్రజా ఉద్యమాలలో క్రియాశీలకంగా పనిచేస్తూనే 2009లో రాయలసీమ విద్యావంతుల వేదిక వ్యవస్థాపక కన్వీనర్‌గా సీమలోని నాలుగు జిల్లాలో ఉద్యమ విస్తరణకు కృషి చేశారు. కర్నూలు జిల్లా నుంచి అనంతపురానికి బదిలీపై వచ్చి, జిల్లా కేంద్రంలోని టీబీ సెంటర్‌ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. నాలుగేళ్లుగా శింగనమల పీహెచ్‌సీలో ప్రభుత్వ వైద్యులుగా పనిచేస్తూ వచ్చారు. కృష్ణమూర్తి మృతి సమాచారం అందుకున్న శింగనమల మండల అధికారులు సోమవారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో సంతాపం ప్రకటించారు. పలువురు మాట్లాడుతూ ఆయన సేవలను కొనియాడారు.   

ఉద్యమానికి తీరని లోటు 
సీమ అభివృద్ధిలో విడదీయరాని అనుబంధం ఏర్పరచుకున్న డాక్టర్‌ కృష్ణమూర్తి మరణం రాయలసీమ ఉద్యమానికి తీరని లోటు అంటూ రాయలసీమ విద్యావంతుల వేదిక సభ్యుడు రామాంజినేయులు, శ్రీనివాసులు, అరుణ్, విరసం నాయకులు పాణి, నాగేశ్వచారి, శశికళ, ఏపీసీఎల్‌సీ నాయకులు ఆచార్య శేషయ్య, జలసాధన సమితి నాయకులు రాంకుమార్, రామకృష్ణ, రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు బొజ్జా దశరథరామిరెడ్డి, వేమన అధ్యయన, అభివృద్ధి కేంద్రం నిర్వాహకులు డాక్టర్‌ అప్పిరెడ్డి హరినాథరెడ్డి , రాయలసీమ విద్యార్థి సంఘం నాయకులు నాగార్జునరెడ్డి, అశోక్‌రెడ్డి, సీమకృష్ణ, డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రత్నం, యేసేపు, గురజాడ అధ్యయన కేంద్రం దేశం శ్రీనివాసరెడ్డి, హంద్రీనీవా సాధన సమితి నాయకులు లోచర్ల విజయభాస్కరరెడ్డి, అరసం రాష్ట్ర అ«ధ్యక్షుడు డాక్టర్‌ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, నానీల నాగేంద్ర, ఉమర్‌ ఆలీషా సాహితీ సమితి అధ్యక్షుడు రియాజుద్దీన్‌ తదితరులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ నెల 21న ఎన్జీవో హోమ్‌లో కృష్ణమూర్తి సంతాప సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top