దర్జాగా డాగ్‌ స్లీపింగ్‌

Dog Sleeping In Municipal Corporation Office Prakasam - Sakshi

ఒంగోలు టౌన్‌: నగరంలో శునకాలను నిరోధిస్తామంటూ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు పదేపదే చెప్పినప్పటికి, వారికి సవాల్‌ చేస్తున్నట్లుగా ఒక శునకం ఏకంగా మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో గురువారం కునుకు తీసింది. మునిసిపల్‌ ఇంజనీర్‌ ఛాంబర్‌కు సమీపంలో ఆ శునకం దర్జాగా నిద్రపోయింది. ఒకవైపు మునిసిపల్‌ కార్యాలయ ప్రాంగణమంతా సబ్సిడీ రుణాల కోసం కోలాహలంగా ఉంది. మరోవైపు కార్యాలయ సిబ్బంది ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు.

ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో ఒక శునకం నీడపట్టు కోసం ఏకంగా మునిసిపల్‌ ఇంజనీర్‌ ఛాంబర్‌ ఉండే కారిడార్‌నే ఎంచుకొంది. దానికి అక్కడ చల్లగా ఉండటంతో గోడకు ఒకవైపు గంటల తరబడి పడుకొని నిద్రించింది. అటూ ఇటూ రాకపోకలు సాగించే సిబ్బంది, వివిధ రకాల పనుల నిమిత్తం వచ్చే ప్రజలు దానిని చూసుకుంటూ వెళ్లారు. మునిసిపల్‌ సిబ్బంది అయితే దానిని తరుముదామన్న ఆలోచన కూడా రాకపోవడం గమనార్హం. నగరంలోని రోడ్లలో శునకాలు లేకుండా చేస్తామని మునిసిపల్‌ అధికారులు పదేపదే ప్రకటిస్తుండగా, వారికి హెచ్చరిక చేస్తున్నట్లుగా ఒక శునకం ఏకంగా మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో గంటల తరబడి కునుకు తీసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top