నోటుకు ఓటు వద్దంటు సైకిల్‌ యాత్ర

Do Not Vote For The Note Cycle Yatra - Sakshi

సాక్షి, అనంతపురం అర్బన్‌ : ప్రజాస్వామ్యంలో ఓటు అమూల్యమైనది. ప్రజావ్యతిరేక పాలకుల పాలిట సింహ స్వప్నం. అవినీతి ప్రభుత్వాలను కూకటివేళ్లతో పెకిలించే శక్తి ఓటుకు మాత్రమే ఉంది.. ఓటు విలువ తెలుసుకో...  ‘నోటుకు అమ్ముకోవద్దు’ అనే నినాదంతో ఓటర్లను చైతన్యపరుస్తూ విశాఖపట్నానికి చెందిన చింతకాల శ్రీను రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్‌ యాత్ర చేస్తూ శనివారం అనంతపురం చేరుకున్నాడు. చింతకాల శ్రీను విశాఖపట్నం నగరం ఆరిలోవ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతను టైల్స్‌ పనిచేస్తూ రోజువారిగా  రూ.600 సంపాదించే కార్మికుడు.

ఏడాదిలో 11 నెలలు కుటుంబం కోసం పని చేయడం.. నెలరోజులపాటు సమాజం బాగుకోసం   ప్రజలను చైతన్యపరిచేందుకు పాదయాత్ర, సైకిల్‌ యాత్ర చేస్తున్నాడు.  ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను జాగృతి పరిచేందుకు సిద్ధపడ్డాడు... ‘ఓటును నోటుకు అమ్మకోవడం వల్ల మన విలువలు ఎలా పడిపోతున్నాయి. ఓటును డబ్బుతో కొన్న పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమానికి మంగళం పాడి, ప్రజాధనాన్ని దోచేస్తున్నారు. నీతి, నిజాయతీ ఉన్న వారిని చట్టసభలకు పంపినప్పుడే వారు ప్రజాహితంగా ఉంటూ సుపరిపాలన అందిస్తారని... అప్పుడే రాష్ట్రం, దేశం సంక్షేమాభివృద్ధి దిశగా పయనిస్తూందని ఓటర్లను చైతన్య పరుస్తున్నాడు. 

సమాజం కోసం సైకిల్‌యాత్ర 
సమాజం మనకు ఏమి ఇచ్చిందని కాదు..సమాజానికి మనం ఏమి చేశామనేది ముఖ్యం. నేను ప్రతి నెలా సంపాదనలో కొంత పోగుచేసి, ఏడాదిలో నెల రోజులు సమాజం కోసం పని చేస్తా. 2018, మే నెలలో విద్యా–వైద్యం వ్యాపారమయం చేయకుండా సామాన్యులకు అందుబాటులో ఉంచాలంటూ విశాఖపట్నం నుంచి అమరావతి వరకు పాదయాత్ర నిర్వహించా. ఎన్నికలు దగ్గరపడ్డాయని ఓటు విలువ తెలియజేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సైకిల్‌ యాత్ర చేపట్టా. అనంతపురంతో కలిపి 12 జిల్లాల్లో యాత్ర పూర్తయ్యింది. కర్నూలుతో తన యాత్ర ముగుస్తుంది.  
– చింతకాల శ్రీను
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top