ఆదాయం కన్నా ఆరోగ్యం మిన్న..

Deputy CM K Narayana Swamy Meeting With Excise Officials In Prakasam - Sakshi

మద్యం విధానంలో ఇదే జగన్‌ ప్రభుత్వ ఆశయం

అక్టోబరు 1 నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు

నేడు ఎక్సయిజ్‌ శాఖామంత్రి అధికారులతో సమీక్ష

సాక్షి, ఒంగోలు: మద్యం ద్వారా వచ్చే ఆదాయం కంటే పేదవాడి కళ్లల్లో కనిపించే సంతోషమే ముఖ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగానే అక్టోబరు 1వ తేదీ నుంచి విచ్చలవిడి మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేస్తూ కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం విక్రయాలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ప్రజా సంకల్పయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా తొలి ఏడాదే 20 శాతం మద్యం దుకాణాలకు చరమగీతం పాడుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ దశలో ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణ సమయంలో ఏర్పడే సవాళ్లను అధిగమించేందుకు, అధికారులకు దశ, దిశను సూచించేందుకు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఎక్సయిజ్‌ శాఖామంత్రి కె.నారాయణస్వామి శుక్రవారం ఒంగోలు రానున్నారు. ఒంగోలులోని డీర్‌డీఏ వెలుగు సమావేశ మందిరంలో ఎక్సయిజ్‌ శాఖ అధికారులు, ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అధికారులతోపాటు పలు విభాగాల అధికారులతోను ఆయన సమీక్షించనున్నారు.

బాబు పాలనలో మద్యం జోరు..
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం ఆదాయ వనరుగా కొనసాగింది. లోటు బడ్జెట్లో ఉన్నామంటూ మద్యం విక్రయాలను గణనీయంగా పెంచేందుకు చర్యలు చేపట్టారు. ప్రతి మద్యం దుకాణానికి అనుబంధంగా పర్మిట్‌రూమును కేటాయించి ఒక్కో రూముకు రూ.5 లక్షల ఫీజు వసూలు చేశారు. ఇక బెల్టుషాపుల జోరు చెప్పనక్కరలేదు. పల్లెపల్లెలో బెల్టుషాపుల హవా నడిచిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

1 నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో విక్రయాలు..
జిల్లాలో రెండు ఏపీ స్టేట్‌ బేవరేజెస్‌ ఉన్నాయి. ఒకటి ఒంగోలు సమీపంలోని పేర్నమిట్టలో ఉండగా రెండోది మార్కాపురంలో ఉంది. ఈ రెండు డిపోల పరిధిలో మొత్తం 331 మద్యం దుకాణాలు బాబు హయాంలో నడిచేవి. 20 శాతం రద్దులో భాగంగా 66 దుకాణాలకు మంగళం పాడారు. దీంతో మద్యం దుకాణాల సంఖ్య 265కు చేరుకుంది. ఇటీవలే ఈ షాపులకు అవసరమైన భవనాలను గుర్తించి స్వాధీనం చేసుకోగా అందులో పనిచేసేందుకు 265 షాపు సూపర్‌వైజర్లను,  గ్రామీణ ప్రాంతాల్లో షాపునకు ఇద్దరు, పట్టణ ప్రాంతాల్లో ముగ్గురు చొప్పున సేల్స్‌మెన్లను నియమించారు.

ఆర్థిక సంవత్సరం మద్యం కేసులు బీరు కేసులు ఆదాయం (రు.కోట్లలో)
2015–16 6,06,960 2,90,300 264.38
2016–17 17,67,308 8,93,512 773.87
2017–18 18,60,093 11,24,875 955.78
2018–19 20,19,263 14,00,011 1147.28

పై పట్టికను పరిశీలిస్తే 2015–16 ఆర్థిక సంవత్సరానికి తరువాతి సంవత్సరానికే దాదాపు నాలుగు రెట్ల ఆదాయం అదికంగా వచ్చినట్లు స్పష్టం అవుతోంది. అదే విధంగా 2016–17కంటే 2017–18లో రూ.182 కోట్లు అదనంగా రాగా, 2018–19లో గత ఏడాదికంటే రూ.191.50 కోట్లు అదనంగా లభించింది. ఈ విధంగా ప్రతి ఏటా అదనపు ఆదాయం కోసం వెంపర్లాడడమే తప్ప ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వినిపించాయి. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐదున్నర నెలల కాలానికి రూ.558.29 కోట్లు మాత్రమే ఆదాయం లభించింది. గత ఏడాది లభించిన వార్షిక ఆదాయాన్ని ఈ ఏడాది చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అంతే తప్ప అదనపు ఆదాయం వచ్చే సూచనలు మాత్రం లేవని స్పష్టం అవుతోంది. 

సవాళ్లపై ప్రత్యేక దృష్టి..
ఇటీవలి కాలంలో మూడు నెలల కాలానికి షాపుల పునరుద్దరణకు ప్రభుత్వం అనుమతించినప్పటికీ వ్యాపారులు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలోనే ఇటు నాటు సారా తయారీ, అక్రమ మద్యం వ్యాపారానికి పలువురు సిద్ధపడ్డారు. సీఎస్‌పురం, దోర్నాల, చీరాల ప్రాంతాలలో నాటుసారాపై అధికారులు దాడులు చేసి పలువురిని అరెస్టు కూడా చేశారు. ఇదే క్రమంలో బెల్టుషాపులపై ఎక్సయిజ్‌తోపాటు పోలీసుశాఖ కఠిన చర్యలు చేపట్టడంతో దాదాపుగా కనుమరుగయ్యాయి. కనిగిరి, పొదిలి ప్రాంతాలలో కొన్ని షాపులలో సీలు వేసి ఉన్న బాటిళ్ల మూతలు తీసివేసి వాటిలో కల్తీ కలిపి తిరిగి యథావిధిగా సీళ్లు వేస్తున్నట్లు ఎక్సయిజ్‌ అధికారులు గుర్తించి కేసులు నమోదు చేయడంతోపాటు బెంగళూరు కేంద్రంగా ఈ రాకెట్‌ నడుస్తున్నట్లు గుర్తించారు.

దీంతో ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం విక్రయాలు నిర్వహించే సమయంలో అక్రమార్కులు నాటు సారా తయారీ, అక్రమ మద్యం విక్రయాలతోపాటు గంజాయి వంటి నిషేధిత ఉత్పత్తుల వైపు కూడా దృష్టి సారించే అవకాశం లేకపోలేదు.  ఇప్పటి వరకు పర్మిట్‌ రూములకు అలవాటు పడినవారు బహిరంగంగా మద్యం సేవించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రజల్లో చర్చ నడుస్తోంది. ఈ దశలో ఇటువంటి వాటిని సమూలంగా అరికట్టేందుకు, షాపుల నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లను తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాన్ని సూచించేందుకు రాష్ట్ర ఎక్సయిజ్‌ శాఖామంత్రి కె.నారాయణ స్వామి నిర్వహిస్తున్న సమీక్ష ప్రధాన భూమిక కానుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top