రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ కళ్లకు గంతలు కట్టుకుంది. ఊరూరా, వీధి వీధినా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కనిపిస్తున్నా, అబ్బే.. బెల్ట్ షాపులా.. లేనే లేవు అంటూ బుకాయిస్తోంది. తద్వారా ప్రభుత్వ పెద్దల మద్యం అక్రమ వ్యాపారానికి వంత పాడుతూ వారి దోపిడీని కప్పిపుచ్చేందుకు పడరాని పాట్లు పడుతోంది.

ఎక్సైజ్ శాఖ తీరు చూస్తుంటే పచ్చ కామెర్లు సోకిన వారికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందన్న చందంగా తయారైంది. సుప్రీంకోర్టు నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నామని కూడా అడ్డగోలుగా బుకాయిస్తుండటం విస్మయపరుస్తోంది.


కర్నూల్లో బస్సు ప్రమాదానికి కారణం మద్యం మహమ్మారే అని స్పష్టమయ్యాక రాష్ట్రంలో రోడ్ల పక్కనున్న మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులపై ఆదివారం ‘సాక్షి’ ఆరా తీస్తే వేలాది షాపులు కనిపించాయి.. అందులో మచ్చుకు కొన్ని ఇవి.. ఇంతగా మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నందుకే రాష్ట్రంలో 16 నెలలుగా నేరాలతో పాటు ప్రమాదాలూ పెరిగాయని ప్రజలు మండిపడుతున్నారు.




