
ఫుల్లుగా తాగించడమే ప్రభుత్వ లక్ష్యం.. మద్యం మాన్పించడం కాదు
టీడీపీ సిండికేట్‌కు భారీ లాభాలు
ప్రభుత్వానికి భారీ రాబడి
అదే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం
2025–26లో రూ.27వేల కోట్లకు పైగా ఆదాయమే లక్ష్యం
ఊరూవాడా బెల్ట్ షాపులతో ఏరులై పారుతున్న మద్యం
మద్యపాన నష్టాలపై అవగాహన కార్యక్రమాలపై ఏమాత్రం శ్రద్ధలేని సర్కారు
డీఅడిక్షన్ కార్యక్రమాలకు కేవలం రూ.10 కోట్లు విదిలింపు
రాష్ట్రంలో మద్యం ఏరులై పారించి అటు టీడీపీ సిండికేట్‌కు భారీ దోపిడీకి.. ఇటు ప్రభుత్వ ఖజానాకు దండిగా కాసులు రాబట్టేందుకు ప్రభుత్వం రాచబాట పరుస్తోంది. అందుకే వీధివీధిలో బెల్ట్ షాపులు తెరిపించి మద్యాన్ని ఏరులై పారిస్తోంది. మరోవైపు మద్యపానం అనర్థాలపై అవగాహన కల్పించేందుకు నవోదయం–2 పేరుతో కార్యక్రమాల నిర్వహిస్తామని చెప్పీచెప్పక మభ్యపెడుతోంది. అసలు లక్ష్యం మాత్రం ఫుల్లుగా తాగించడమే.. మద్యం మాన్పించడం కాదనే విషయాన్ని బడ్జెట్ సాక్షిగా తేల్చి చెప్పేసింది. – సాక్షి, అమరావతి
రూ.27 వేల కోట్లకు పైగా రాబట్టండి
2025–26లో ఎక్సైజ్ శాఖకు లక్ష్యం
మద్యం విక్రయాలపై పన్నుల ఆదాయమే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఇంధనమని చంద్రబాబు ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. గత నెలలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో ఆ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. 2025–26లో మద్యం విక్రయాలపై పన్నుల ద్వారా రూ.27 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు అంతకంటే ఎక్కువగా ఆదాయం రాబట్టాలని ఎక్సైజ్ శాఖకు లక్ష్యంగా నిర్దేశించింది.
కనీసం రూ.30 వేల కోట్ల రాబడి రావాలని స్పష్టం చేసింది. 2024 అక్టోబర్ నుంచి 2025 మార్చి నాటికి ఆరు నెలల్లోనే రూ.12 వేల కోట్ల వరకు మద్యం ద్వారా ఆదాయం రాబట్టారు. ఇక 2025–26లో మద్యం అమ్మకాలు మరింత పెంచాలని.. తద్వారా భారీ ఆదాయం సాధించిపెట్టాలని ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు స్పష్టం చేసింది. రాబోయే మూడేళ్లలో మరింత ఆదాయం పెంచేందుకు లక్ష్యంగా పెట్టుకుంది.
ఊరూరా పారించండి.. మత్తులో ఊగించండి
మద్యం విక్రయాలపై పన్నుల ఆదాయం లక్ష్యం సాధించేందుకు రాష్ట్రంలో మద్యం ఏరులై పారించాలని ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు తేల్చి చెప్పింది. టీడీపీ మద్యం సిండికేట్‌కు పూర్తిగా సహకరించడం ద్వారానే ఆ లక్ష్యాన్ని సాధించగలరనే విషయాన్ని చల్లగా చెప్పింది. టీడీపీ మద్యం సిండికేట్ అక్రమాలకు ఎక్సైజ్ శాఖ వత్తాసు పలకాలని స్పష్టం చేసింది. ఒక్కో మద్యం దుకాణం పరిధిలో ఇష్టానుసారంగా బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేసినా పట్టించుకోవద్దన్నదే ప్రభుత్వ ఆదేశాల వెనుక లోగుట్టు.
2014–19లో టీడీపీ హయాంలో రాష్ట్రంలో 43వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగించారు. ప్రస్తుతం అంతకంటే ఎక్కువగా బెల్ట్ దుకాణాలను టీడీపీ సిండికేట్ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో కాలనీల్లో, మండల కేంద్రాల్లో, పంచాయతీ కేంద్రాలు, గ్రామాల్లో వీధికొకటి చొప్పున బెల్ట్ దుకాణాలు వెలుస్తున్నాయి. అలా దాదాపు 60వేలకు పైగా బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేస్తేనే మద్యం అమ్మకాల లక్ష్యాలు సాధించగలమని ప్రభుత్వ పెద్దలు ఎక్సైజ్ అధికారులకు ఉద్బోధించారు.
చంద్రబాబు గత ప్రభుత్వంలో చివరి ఏడాది అంటే 2018–19లో 3.84 కోట్ల కేసుల ఐఎంఎల్ మద్యం, 2.77 కోట్ల కేసుల బీరు అమ్మకాలు సాధించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో సమర్థవంతంగా దశలవారీ మద్య నియంత్రణ విధానంతో మద్యం అమ్మకాలు తగ్గించింది.
కానీ.. ప్రస్తుత ప్రభుత్వం తాము 2018–19లో సాధించిన మద్యం విక్రయాల గణాంకాలే ప్రాథమిక ప్రాతిపదికగా చేసుకుని 2025–26లో అంతకంటే భారీగా మద్యం విక్రయాలు సాగించాలని నిర్దేశించింది. అంటే ఈ ఏడాది దాదాపు 4.50 కోట్ల కేసులకుపైగా ఐఎంఎల్ మద్యం, 3.50 కోట్ల కేసులకుపైగా బీరు అమ్మకాలు లక్ష్యంగా పెట్టుకుందన్నది సుస్పష్టం.
మద్యం మాన్పించడం మన పని కాదు
మద్యపాన అనర్థాలపై ప్రచారంపై ప్రభుత్వ శీతకన్ను
మద్యం అమ్మకాలు భారీగా పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం నవోదయం2 కార్యక్రమంపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోంది. మద్యపానంతో కలిగే అనర్థాలు, దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించడం నవోదయం–2 లక్ష్యం. కానీ.. ఆ కార్యక్రమాల నిర్వహణ కోసం 2025–26 బడ్జెట్‌లో ప్రభుత్వం కేవలం రూ.10 కోట్లు కేటాయించింది. ఏడాదిపాటు రాష్ట్రవ్యాప్తంగా సదస్సుల నిర్వహణ, కళాకారులతో కళారూపాల ప్రదర్శనలు, వైద్య నిపుణులు, మానసిక వైద్యులతో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ, పత్రికలు, టీవీల్లో ప్రకటనలు తదితర కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించాలి.
26 జిల్లాల్లో ఏడాదిపాటు నిర్వహించే ఈ కార్యక్రమాలకు కేవలం రూ.10 కోట్లు కేటాయించడంపై సామాజికవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మద్యం విక్రయాల ద్వారా రూ.27 వేలకోట్ల ఆదాయానికి గురిపెట్టిన ప్రభుత్వం.. మద్యపాన అనర్థాలపై అవగాహన కార్యక్రమాలకు మాత్రం అందులో 0.03 శాతం నిధులు విదల్చడం విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నారు. కనీసం ఒక్క శాతం నిధులు కూడా కేటాయించకపోవడం ద్వారా మద్యపాన అనర్థాలపై అవగాహన కల్పించడంపై తమకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చంద్రబాబు ప్రభుత్వం తేల్చిచెప్పింది.
బార్ల తలుపులు బార్లా...
మద్యం ఏరులై పారించే పన్నాగంలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం బార్లకు తలుపులు బార్లా తెరిచింది. త్రీస్టార్, అంతకంటే ఎక్కువ కేటగిరీ హోటళ్లలో బార్లలో గ్లాసులు ఇకమీదట మరింతగా ఘల్లుమననున్నాయి. త్రీస్టార్, ఫైవ్‌స్టార్ హోటళ్లలో బార్ల లైసెన్సు ఫీజును భారీగా తగ్గించడం గమనార్హం. ఇప్పటివరకు స్టార్ హోటళ్లలో బార్ల కు రూ.66 లక్షలు లైసెన్స్ ఫీజుగా ఉండేది. దాన్ని గణనీయంగా తగ్గిస్తూ రూ.25 లక్షలు లైసెన్స్ ఫీజుగా మంత్రిమండలి సమావేశంలో తీర్మానించారు.
అందుకు పర్యాటకులను ఆకర్షించడం అనే ముసుగు తొడగడం ప్రభుత్వ పన్నాగానికి నిదర్శనం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ అసలు ఉద్దేశాన్ని బయటపెట్టాయి. ‘బార్ల లైసెన్సు ఫీజు తగ్గినంత మాత్రాన ప్రభుత్వానికి రాబడి తగ్గుతుందని అనుకోవద్దు.. లైసెన్సు ఫీజు తగ్గించడంతో ఇప్పటివరకు బార్లులేని త్రీస్టార్ హోటళ్లలో ఇకమీదట ఏర్పాటు చేస్తారు.. తద్వారా భారీగా మద్యం అమ్మకాలు పెరిగి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది..’ అని తమ విధానాన్ని సమర్థించుకోవడం గమనార్హం.
ఇక మరో 44 బార్లకు లైసెన్సుల జారీకి ప్రభుత్వం రెండురోజుల కిందట నోటిఫికేషన్ కూడా జారీచేసింది. అంటే మద్యం అమ్మకాలు భారీగా పెంచడమే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏకైక ధ్యేయంగా పెట్టుకుందన్నది సుస్పష్టం.