ఊపిరి తీసుకునే వ్యవధి ఇవ్వకుండా వరుసగా విపత్తులతో జిల్లాపై కాఠిన్యం ప్రదర్శించిన ప్రకృతి కాస్త కనికరం చూపించింది. పెను విపత్తుగా పరిణమించవచ్చని
గడిచిన గండం
Nov 29 2013 3:55 AM | Updated on Sep 2 2017 1:04 AM
అమలాపురం, న్యూస్‌లైన్ :ఊపిరి తీసుకునే వ్యవధి ఇవ్వకుండా వరుసగా విపత్తులతో జిల్లాపై కాఠిన్యం ప్రదర్శించిన ప్రకృతి కాస్త కనికరం చూపించింది. పెను విపత్తుగా పరిణమించవచ్చని భయపెట్టిన లెహర్ తుపాను.. వికృతరూపం దాల్చకుండానే నిష్ర్కమించింది. వరుస దెబ్బలతో తట్టుకోలేక విలవిల్లాడుతున్న రైతులను, తీరప్రాంతవాసులను గడచిన మూడు రోజులుగా ఠారెత్తించిన లెహర్ దిశ మార్చుకోవడంతోపాటు గురువారం తీరానికి వచ్చే సమయానికి బలహీనపడి వాయుగుండంగా మారింది. దీంతో గండం గట్టెక్కిందని ప్రజలు, అధికారులు స్థిమితపడ్డారు. అయితే ఇప్పటికే చావుదెబ్బలు తినీ, తినీ.. గట్టిగా నిట్టూర్చేందుకు గానీ, ప్రకృతిని తిట్టేందుకు గానీ సత్తువ లేనంతగా డీలా పడిన వరి రైతులు మాత్రం లెహర్‌తో పాటు వాన బెడదా పూర్తిగా విరగడ కావాలని కోరుకుంటున్నారు.
లేకపోతే పోగా మిగిలిన గింజలు కూడా దక్కకుండా పోతాయని ఆక్రోశిస్తున్నారు. ప్రచండ వేగంతో దూసుకొస్తున్న లెహర్ తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని, ఆ సమయంలో 170 నుంచి 200 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ మూడు రోజుల క్రితం ప్రకటించింది. అప్పటికే హెలెన్ తుపాను కొట్టిన చావుదెబ్బ నుంచి కోలుకోకుండానే మరో భారీ విపత్తును ఎదుర్కొనాల్సి రావడంతో బాధితులు ముఖ్యంగా కోనసీమ, తీరప్రాంతవాసులు భీతిల్లిపోయారు. మరోవైపు అధికారులు ఉరుకులు, పరుగులు తీశారు. హెలెన్ తుపాను సందర్భంగా సరైన విధంగా స్పందించలేదని విమర్శల పాలవడంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలింది. 1996లో కోనసీమను కకావికలం చేసిన పెనుతుపానును దృష్టిలో పెట్టుకుని లెహర్‌ను ఎదుర్కొనేందుకు హుటాహుటిన చర్యలు తీసుకున్నారు.
ప్రత్యేకాధికారి ఎం.రవిచంద్ర, కలెక్టర్ నీతూ ప్రసాద్‌లతో పాటు పలు శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం ఉదయం నుంచి తుపాను ప్రభావం ఉంటుందని బుధవారం సాయంత్రానికే తీరప్రాంతాల్లోని మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 15 మండలాల్లో 57 గ్రామాలపై లెహర్ తుపాను ప్రభావం చూపుతుందని అంచనా వేసిన అధికారులు బుధవారం రాత్రికి 73 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 29,865 మందిని తరలించారు. మిగిలినవారి తరలింపు బుధవారం అర్ధరాత్రి తర్వాత కూడా కొనసాగింది. నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్)కు చెందిన 16 బృందాలు, ఆర్మీకి చెందిన రెండు బృందాలు జిల్లాలో మోహరించాయి. తుపాను సృష్టించగల విధ్వంసం గురించి హెచ్చరిస్తూ గడచిన రెండు రోజులుగా భారీగా ప్రచారం చేయడంతో జిల్లా ప్రజలు బుధవారం రాత్రి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. అమలాపురం, రాజోలు డిపోల నుంచి తీరప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులను అధికారులు ముందుజాగ్రత్త చర్యగా నిలిపివేశారు.అయితే లెహర్ తుపాను తీరం దాటే సమయానికి బలహీనపడి వాయుగుండంగా మారడం, మచిలీపట్నం వద్ద తీరం దాటడంతో జిల్లాపై పెద్దగా ప్రభావం చూపలేదు.
కోనసీమలో జోరువాన
కాగా బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం రాత్రి వరకూ జిల్లాలోని అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, తుని, మండపేట తదితర ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి. అమలాపురంలో గురువారం రాత్రి సమయంలో పావుగంట పాటు భారీ వర్షం కురిసింది. రాత్రి 9 గంటల నుంచి కోనసీమలోని పలుచోట్ల వర్షం జోరం దుకుంది. స్పల్పంగా ఈదురు గాలులు వీచాయి. ఉప్పాడ వద్ద సముద్రపు అలలు ఐదడుగుల ఎత్తున ఎగసిపడ్డాయి. తుపాను ప్రమా దం వీడినా పునరావాస కేంద్రాల్లో బాధితులు ఇళ్లకు వెళ్లేందుకు అధికారులు అంగీకరించడంలేదు. శుక్రవారం ఉదయం మాత్రమే వీరిని పంపే అవకాశం ఉంది. ఇప్పటికీ జిల్లాలో 26 మండలాల్లో 84 గ్రామాలకు చెందిన 31,665 మందిని వంద పునరావాస కేంద్రాల్లో ఉంచినట్టు అధికారులు చెబుతున్నారు.
అయితే తుపాను ప్రభావం వీడడం తో మూడొంతుల మంది ఇళ్ల బాటపట్టారు. మిగిలినవారు పునరావాస కేంద్రాల్లోనే అరకొర సౌకర్యాల మధ్య అవస్థలు పడుతూ, సొంత గూళ్లకు చేరే సమయం కోసం ఎదురు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. హెలెన్ తుపాను వల్ల దెబ్బతిన్న విద్యుత్ సరఫరాను పునరుద్ధరించకపోవడంతో తీరంలోని పలు గ్రామాల్లో ఇంకా అంధకారం నెలకొంది. కాట్రేనికోన, ఐ.పోలవరం, ఉప్పలగుప్తం, అల్లవరం, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో తాగునీటి సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాగా గురువారం పడ్డ వర్షం వరి రైతులను మరింత బెంగటిల్లజేస్తోంది. పోగా మిగిలిన నాలుగు గింజలనైనా దక్కించుకుందామన్న తమ ఆశ పాలిట ఈ వర్షం అశనిపాతమవుతుందని రైతులు వాపోతున్నారు.
Advertisement
Advertisement