శ్రీనివాస్ హత్య కేసులో కొత్త కోణాలు
ఇప్పటికే పోలీసుల అదుపులో ప్రధాన నిందితులు
అనుమానితులను పిలిచి విచారిస్తున్న పోలీసులు
ఆడియోను సోషల్ మీడియాలో పెట్టిన
ఇద్దరి వ్యక్తుల పాత్ర ఏమిటి?
అమలాపురం టౌన్: ప్రశాంతంగా ఉండే అమలాపురం పట్టణంలో దాదాపు పదేళ్ల తర్వాత రౌడీల మధ్య గ్యాంగ్ వార్ మళ్లీ మొదలవుతోందా? అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. పట్టణంలోని కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీనివాస్ కిరాతక హత్యతో ఈ సందేహాలకు బలం చేకూరుతోంది. గతంలో పట్టణంలో రౌడీ షీటర్ల మధ్య కోల్డ్ వార్ నడిచేది. ఈ క్రమంలో ఘర్షణలు, గొడవలు జరిగేవి. వాటిన్నటికీ స్వస్తి చెప్పి ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్న పట్టణంలో శ్రీనివాస్ హత్య కొత్త కలకలం సృష్టిస్తోంది. శ్రీనివాస్ తొలుత అదృశ్యమై ఆ తర్వాత కిడ్నాప్, కిరాతకంగా హత్యకు గురైన ఘటనతో రౌడీల గ్యాంగ్‌వార్ సంకేతాలు కనిపిస్తున్నాయి. పదేళ్ల కిందట అప్పటి సీఐ పట్టణంలో ఆరుగురు రౌడీలను గుర్తించి వారే గ్యాంగ్‌లు నిర్వహిస్తున్నారని నిర్ధారించారు.
ఆ ఆరు గ్యాంగ్‌లపై కేసులు నమోదు చేసి అరెస్ట్‌లు చేశారు. శ్రీనివాస్ దారుణ హత్య నేపథ్యంలో ఇప్పుడు పట్టణంలో మళ్లీ ఘర్షణ వాతావరణం ఉత్పన్నమవుతుందన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ హత్య కేసుకు సంబంధించి ప్రధాన నిందితులైన పట్టణానికి చెందిన మాజీ రౌడీ షీటర్ గంగుమళ్ల కాసుబాబు, అడబాల శంకర్, సలాది రాంబాబు (అప్పన్న), భాస్కర్ల ప్రసాద్ (డ్రైవర్), అనిల్ (రావులపాలెం)లు పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిని ఐదు పోలీసు బృందాలు నాలుగు రాష్ట్రాల్లో గాలించి పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో మరికొంత మందిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు పోలీసుల విచారణ, దర్యాప్తు తీరును బట్టి తెలుస్తోంది.
ఆడియోను వైరల్ చేసిన ఆ ఇద్దరి పాత్ర ఏమిటి?
హత్యకు ముందు కాసుబాబు, మృతుడు శ్రీనివాస్ మధ్య ఫోన్‌లో జరిగిన సంభాషణ ఆడియో సోషల్ మీడియాలో హల్‌చల్ అయింది. వారి వాగ్వాదంలో బండ బూతులు దొర్లడంతో ఆ మాటలే కక్షకు దారి తీసి హత్యకు పురిగొల్పాయా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడానికి మరో మాజీ రౌడీïÙటర్‌తోపాటు ప్రధాన నిందితుల్లో ఒకరు ప్రధాన కారణమని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఎందుకు ఆడియోను వైరల్ చేశారు?, ఈ హత్యకు ఎందుకు వీరు ప్రేరేపించారనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.


