కిరీటాలు కరిగించేశారా?

Crown Missing Case Still Pending in Chittoor - Sakshi

శ్రీగోవిందరాజస్వామి మూడు కిరీటాల కథ కంచికేనా?

ఇంకా దొరకని దొంగలు విచారణ పేరుతో కాలయాపన

మాయమైన వాటి స్థానంలో కొత్త కిరీటాల తయారీ

శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో మాయమైన కిరీటాలు విక్రయించడం.. వాటిని కరిగించడం జరిగిపోయిందని తెలిసింది. అయితే ఈ విషయాన్ని టీటీడీ బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంది. మాయమైన కిరీటాల స్థానంలో     కొత్త వాటిని తయారు చేయించి యథాస్థానంలో ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు     విశ్వసనీయ సమాచారం.

సాక్షి, చిత్తూరు, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవమూర్తుల విగ్రహాలకు అలంకరించిన మూడు బంగారు కిరీటాలు మాయమైన విషయం తెలిసిందే. రెండు వారాల క్రితం మాయమైన ఈ కిరీటాల జాడ ఇంతవరకు తెలియలేదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా దొంగల జాడ కనిపెట్టకపోవడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. 1970లో తిరుమల శ్రీవారికి కానుకగా వచ్చిన ఈ మూడు కిరీటాల బరువు ఒక కిలో 300 గ్రాములు. ఆ కిరీటాలను బంగారు, వజ్రాలతో తయారుచేసి శ్రీవారికి సమర్పించారు. అయితే తిరుమలలో స్వామి వారికి కిరీటాలు ఉండడంతో వాటిని తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఉత్సవమూర్తులకు అలంకరించారు. ఆ కిరీటాలతోనే ప్రతిరోజూ ఉత్సవమూర్తులను ఊరేగించేవారు. అయితే నిఘా వైఫల్యంతో విలువైన మూడు కిరీటాలు మాయమయ్యాయి.

గుట్టుచప్పుడు కాకుండా విచారణ
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాలు మాయం టీటీడీకి మరో మాయని మచ్చగా మిగిలిపోయింది. విచారణ వేగవంతం చేసిన పోలీసులు, టీటీడీ విజిలెన్స్‌ ఆలయ అర్చకులు, సిబ్బందిని విచారించారు. అదేవిధంగా ఆటో డ్రైవర్, తమిళనాడుకు చెందిన మరి కొందరిని ఆదుపులోకి తీసుకున్నారు. మొత్తం 27 మందికి పైగా విచారించినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో తమిళనాడుకు చెందిన మత్తయ్య ఒకరు. మాయం చేసిన కిరీటాలను దొంగలు విక్రయించినట్లు సమాచారం. తిరుపతిలోని ఓ బంగారు వ్యాపారస్తుడికి విక్రయించడం, అతనుఇతర ప్రాంతాలకు తరలించి కరిగించడం కూడా పూర్తి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు, టీటీడీ విచారణలో విషయం బయటపడడంతో బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది.

అందులో భాగంగానే రెండు వారాలైనా విచారణ పురోగతిపై ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడమే ఇందుకు నిదర్శనమని శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించేందుకు ప్రయత్నించినా.. పత్రికలు, మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు ఎక్కడో ఓచోట దొరికిపోతామనే కారణంతో గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం. మాయమైన కిరీటాలను తయారు చేయించి గుట్టుచప్పుడు కాకుండా ఉత్సవమూర్తులకు అలంకరించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో కిరీటాలను తయారుచేయిస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. కిరీటాల తయారీ పూర్తయ్యాక.. దొంగలను మీడియా ముందు ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. దొంగలను చూపించి స్వాధీనం చేసుకున్న కిరీటాలను ఉత్సవమూర్తులకు అలంకరించామని చెప్పి కేసును తొక్కిపెట్టే యత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతుండడం గమనార్హం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top