ఆ వైర్లు షాక్‌ కొట్టవు!

Covered cum ducklars for power line wires - Sakshi

వీధి లైన్లకు స్వీడన్‌ తరహా కండక్లర్లు

జిల్లాకు 30 కిలోమీటర్లు మంజూరు

కిలోమీటర్‌కు రూ.8లక్షల చొప్పున రూ.2.40 కోట్లు వ్యయం

ప్రారంభించిన ఈపీడీసీఎల్‌ అధికారులు

విజయనగరం, బొబ్బిలి: మన ఇళ్లు... డాబాల మీదుగా వెళ్లే విద్యుత్‌ వైర్లతో ఇక అవస్థలు పడనక్కరలేదు. అవి షాక్‌ కొడతాయని భయపడక్కర్లేదిక! ఎందుకంటే ఇక నుంచీ షాక్‌ కొట్టని వైర్లు వస్తున్నాయి. కరెంటు వైర్లు షాక్‌ కొట్టకపోవడమేంటంటారా? జిల్లాలో ప్రయోగాత్మకంగా కవర్డ్‌ కం డక్లర్లు అమరుస్తున్నా రు. ఇప్పటికే ఈ పనులు ప్రారంభమయ్యా యి. స్వీడన్‌ నుంచి వచ్చి న ఈ వైర్లను జిల్లాలోని రెండు మున్సిపాలిటీలకు మాత్ర మే అందజేశారు. దీంతో ఈపీడీసీఎల్‌ అధికారులు ప్రస్తుతం ఈ పనులు నిర్వహిస్తున్నారు. స్వీడన్‌ దేశంలో అమలవుతున్న ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ముందు అమలు చేసి దాని పనితీరు చూసి అటు తరువాత జిల్లా వ్యాప్తంగా వైర్లను మార్చేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

రెండు మున్సిపాలిటీల్లో30 కిలోమీటర్ల మేర మార్పులు
విజయనగరం, బొబ్బిలి మున్సిపాలిటీల్లో మాత్రమే ఈ వైర్ల మార్పు జరుగుతోంది. విజయనగరం మున్సిపాలిటీలో 20 కిలోమీటర్ల చొప్పున, బొబ్బిలిలో 10 కిలోమీటర్ల చొప్పున ఈ కొత్త కండక్టర్లతో లైన్లు మార్చుతున్నారు. బొబ్బిలిలో ఇప్పటికే సుమారు 30 శాతం పైగా పనులు పూర్తి కావచ్చాయి.

నిర్వహణ ఇక సులభం
కొత్తగా వచ్చిన కవర్డ్‌ కండక్లర్ల వల్ల నిర్వహణ చాలా సులభమవుతుంది. గతంలో చెట్ల కింది నుంచి గ్రామాలు, పట్టణాలకు వెళ్లే విద్యుత్‌ వైర్ల వల్ల షార్ట్‌సర్క్యూట్‌ ప్రమాదాలు తరచూ చోటు చేసుకునేవి. పెద్ద పెద్ద మంటలు రేగుతూ జిల్లాలో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్న విషయం విదితమే. ఇప్పుడీ కొత్త తరహా వైర్ల వల్ల ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు. ఎందుకంటే కవర్డ్‌ కండక్లర్ల వలన రెండు వైర్లు కలసి పోయినా, లేక వైర్లను ప్రమాదావశాత్తూ తాకినా ప్రమాదాలు జరగవు. అందువల్ల నిర్వహణ ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశముంది.

ఖర్చు దాదాపు రెండింతలు
ప్రస్తుతం జిల్లాలో స్వీడన్‌ తరహా విద్యుత్‌ లైన్ల మార్పిడికి ఖర్చు భారీగానే అవుతోంది. అయితే భద్రత దృష్ట్యా ఈ ఖర్చుకు వెనుకాడక్కర్లేదని అధికారులు చెబుతున్నారు. సంప్రదాయ కండక్టర్‌ ధర కిలోమీటర్‌కు రూ.4లక్షలు అయితే ఇది కిలోమీటర్‌కు రూ.8 లక్షలు అవుతుంది.మొత్తంగా రెండు మున్సిపాలిటీల్లోనూ విద్యుత్‌ వైర్ల కొనుగోలుకే రూ.2.40 కోట్లు ఖర్చవుతుంది. జిల్లా వ్యాప్తంగా ఈ కవర్డ్‌ కండక్లర్లు ఏర్పాటు వల్ల ఎంతో భద్రత ఉంటుందని విద్యుత్‌ శాఖాధికారులు, ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

కవర్డ్‌ కండక్టర్లతో భద్రత
జిల్లాలోని బొబ్బిలి, విజయనగరం మున్సిపాలిటీలకు కొత్తగా స్వీడన్‌ టెక్నాలజీతో కవర్డ్‌ కండక్లర్‌లు మంజూరయ్యాయి. బొబ్బిలికి పది కిలోమీటర్లు మంజూరయ్యాయి. ఆ పనులు చేస్తున్నాం. త్వరలో పనులు పూర్తవుతాయి. దీని వల్ల భద్రతకు అవకాశం ఉంటుంది. – లచ్చుపతుల సత్యనారాయణ, ఏడీఈ, ఈపీడీసీఎల్, బొబ్బిలి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top