
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపులో అపశృతి నెలకొంది. ఊరేగింపు రథానికి కరెంట్ తీగలు తగిలి ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. పండుగ వేడుకల్లో ఇలా జరగడంతో స్థానికులు కన్నీటపర్యంతమవుతున్నారు.
వివరాల ప్రకారం.. రామంతాపూర్‌లోని గోకులేనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా రథాన్ని ఊరేగించారు. రథాన్ని లాగుతున్న వాహనం మొరాయించడంతో దాన్ని పక్కన నిలిపివేసిన స్థానిక యువకులు.. రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి షాక్ బలంగా కొట్టడంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లు దూరంగా పడిపోయారు. ఒక్కసారిగా కరెంట్ షాక్ ఘటనతో అక్కడంతా భయానక వాతావరణం చోటుచేసుకుంది.

ఈ ఘటనతో వెంటనే తేరుకున్న స్థానికులు.. గాయపడిన తొమ్మిది మందిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఐదుగురు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో నలుగురిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మృతిచెందిన వారిలో కృష్ణయాదవ్ (21), సురేశ్ యాదవ్(34), శ్రీకాంత్‌రెడ్డి(35), రుద్రవికాస్(39), రాజేంద్రరెడ్డి(45) ఉన్నట్లు గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గన్‌మెన్ శ్రీనివాస్ సైతం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.