పకడ్బందీగా లెక్కింపు

Counting Arrangements Are Going On Properway - Sakshi

ఓట్లలెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలని, ఏ చిన్న తప్పు జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి వీరపాండియన్‌ సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం ఆయన ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలకు డెమో కౌంటింగ్‌ వివరించారు.     అనంతరం ఎస్పీతో కలిసి కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను చిత్రీకరించడంతో పాటు కౌంటింగ్‌ కేంద్రంలో హాట్‌లైన్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని,    కౌంటింగ్‌లో  పాల్గొనే సిబ్బందికి రవాణా సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. 

సాక్షి, అనంతపురం అర్బన్‌: ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలది కీలకపాత్ర అని, కౌంటింగ్‌ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి.వీరపాండియన్‌ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ఎలా చేయాలనే అంశంపై మంగళవారం జేఎన్‌టీయూలోని కౌంటింగ్‌ కేంద్రంలో ఆర్‌ఓలు, ఏఆర్‌ఓల ద్వారా డెమో కౌంటింగ్‌ చేయించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ కౌంటింగ్‌ విధానం గురించి వివరించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి కౌంటింగ్‌ టేబుల్‌కు ఈవీఎం పెట్టెలను సహాయకులు తీసుకొచ్చి ఉంచుతారన్నారు. కంట్రోల్‌ యూనిట్‌ను బ్యాలెట్‌ యూనిట్‌కు కనెక్ట్‌ చేసి అందులో అభ్యర్థుల వారీగా పోలైన ఓట్ల వివరాలను 17సి పార్ట్‌–2లో రౌండ్‌ల వారీగా నమోదు చేయాలని సూచించారు. పోలైన ఓట్లను హాల్‌లోని ఏజెంట్లు, సూక్ష్మ పరిశీలకులు, కౌంటింగ్‌ అసిస్టెంట్లకు చూపించాల్సిన బాధ్యత కౌంటింగ్‌ సూపర్‌వైజర్లదేనన్నారు. రౌండ్లు మేరకు సిద్ధం చేసుకుని ఉంచిన ఫోల్డర్‌లో రౌండ్‌ కౌంటింగ్‌ షీట్‌ను ఉంచి కంపానియన్‌ టేబుల్‌కు పంపించి, సిస్టంలో నమోదు చేయించాలన్నారు. తరువాత సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. 
నేడు రెండో రాండమైజేషన్‌ 
ఎన్నికల పరిశీలకుల ఆధ్వర్యంలో ఆర్‌ఓల సమక్షంలో బుధవారం రెండో విడత రాండమైజేషన్‌ ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. 23వ తేదీ ఉదయం 5 గంటల్లోగా మూడో రాండమైజేషన్‌ జరుగుతుందన్నారు. అప్పుడు కౌంటింగ్‌ కేంద్రాలు, టేబుళ్లను కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో జేసీ ఎస్‌.డిల్లీరావు, జేసీ–2 హెచ్‌.సుబ్బరాజు, ట్రైనీ కలెక్టర్‌ ఎం.జాహ్నవి, డీఆర్‌ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, నోడల్‌ అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు. 

ఎన్నికల కౌంటింగ్‌కు భద్రత కట్టుదిట్టం

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ఆఖరు ఘట్టమైన కౌంటింగ్‌ రోజున కట్టుదిట్టమైన భద్రత చేపట్టామని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ మంగళశారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫ్యాక్షన్, సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా వేశామని, జిల్లా బలగాలే కాకుండా ఎపీఎస్పీ, సీఆర్పీఫ్‌ బలగాలను సైతం భారీగా వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. కౌంటింగ్‌ రోజున రిటర్నింగ్‌ అధికారుల అనుమతి లేనిదే ఎవరినీ కౌంటింగ్‌ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లోకి అనుమతించమని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా  నాయకులు, కార్యకర్తలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top