ఇంటి దొంగలు ! | Corruption In House Constructions | Sakshi
Sakshi News home page

ఇంటి దొంగలు !

Mar 29 2018 10:50 AM | Updated on Sep 22 2018 8:25 PM

Corruption In House Constructions - Sakshi

అనంతపురం న్యూసిటీ: పాలకులు నిబంధనలకు తూట్లు పొడిచినా ఒప్పే. అదే ప్రజలు చేస్తే మాత్రం తప్పే. భవనాలను కూల్చేయాలి. భవిష్యత్తులో కాలువ, రోడ్ల నిర్మాణానికి ఇబ్బంది అవుతుందంటూ అధికార పార్టీ నేతలు, అధికారులు హంగామా చేసేస్తారు. మరి హంగామారాయుళ్ల సొంత విషయానికొస్తే మాత్రం ఇలాంటివేవీ కనిపించవు. చాపకింద నీరులా ఈ సంస్కృతి నగరంలో రోజురోజుకూ విస్తరిస్తోంది. అధికార  పార్టీ నేతలకు చెందిన నిర్మాణాలపై ఎవరూ ప్రశ్నించకూడదనే వైఖరితో టీడీపీ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. 

చూసీ చూడనట్లు అధికారులు అక్రమ నిర్మాణాలను అడ్డుకునే అధికారులకు చేదు అనుభవాలే మిగులుతున్నాయి. అందిన సమాచారం మేరకు అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు అధికారులు వెళితే.. వెంటనే అక్కడకు ప్రజాప్రతినిధులు వాలిపోతుంటారు. తమవాళ్లేనంటూ వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతారు. నిబంధనల గురించి అధికారులు మాట్లాడితే.. ఇక తమదైన శైలిలో నోటి దురుసుతో విరుచుకుపడుతుంటారు. దీంతో అధికారులు వెనుదిరుగుతున్నారు. రాంనగర్, మారుతీనగర్, సాయినగర్, కమలానగర్, ఆదిమూర్తినగర్, హౌసింగ్‌బోర్డు, ఆదర్శనగర్, అరవిందనగర్, ఇలా వివిధ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. 

చర్యలు తీసుకుంటాం
కమలానగర్‌లో సెల్లార్‌ తవ్వి నిర్మా ణాలు చేపడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం.             – ఇషాక్‌ అహ్మద్, ఏసీపీ

నిత్యం జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ వెళ్లే సాయినగర్‌ 8వ క్రాస్‌ సమీపంలో ఓ నిర్మాణం వెలుస్తోంది. బయటి దుకాణాలను అలాగే ఉంచి, వెనుక వైపు నిర్మాణం చేపడుతున్నారు. ఎలాంటి సురక్షిత ప్రమాణాలు పాటించడం లేదు. దీని వెనుక ఓ అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌ ప్రమేయమున్నట్లు పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు సైతం అక్రమ నిర్మాణంపై ప్రశ్నిస్తే మావాళ్లే వదిలేయండంటూ సదరు కార్పొరేటర్‌ వకాల్తా పుచ్చుకుని మాట్లాడినట్లు తెలుస్తోంది.

సాయినగర్‌ రెండో క్రాస్‌లో ఓ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు నిబంధనలకు విరుద్ధంగా షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపట్టాడు. నగరపాలక సంస్థ అధికారులు అక్కడి వెళ్లి నిర్మాణాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రజాప్రతినిధి నుంచి ఫోన్‌ రావడంతో అధికారులు నోరు మెదపకుండా వెనుదిరిగారు.

సాధారణంగా కమలానగర్‌లో ఎక్కడ అక్రమ నిర్మాణం జరుగుతున్నా.. వెంటనే అక్కడకు 15 డివిజన్‌ టీడీసీ కార్పొరేటర్‌ శ్రీనివాసులు వాలిపోయి హంగామా చేసేస్తుంటారు. అంతటితో ఆగకుండా అధికారులకు ఫిర్యాదు చేసి నిర్మాణాలను ఆపించేస్తుంటారు. ఇదంతా చూసి ఆయన  నిజాయితీపరుడని అనుకుంటే పొరబాటు పడినట్లే! ఎందుకంటారా? ఈ చిత్రంలో మీరు చూస్తున్నది కమలానగర్‌లో సెల్లార్‌ ఏర్పాటుతో పాటు స్కావెంజర్‌ లేన్‌ను ఆక్రమించి నిర్మాణాన్ని చేపట్టారు. అయితే ఇదే ఫొటోలో పనులు పర్యవేక్షిస్తూ కూర్చొన్న వ్యక్తి కార్పొరేటర్‌ శ్రీనివాసులు!!  ఫొటో తీస్తుండగా ఈ భవనం తనదేనని, తానే నిర్మాణాన్ని చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement